ప్ర‌స్తుతానికి కాక‌పోయినా రాబోయే రెండు మూడు సంవ‌త్స‌రాల త‌ర్వాతైనా కేంద్రంలోని భార‌తీయ జ‌న‌తాపార్టీ పెద్ద‌ల‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌తో అవ‌స‌రం ఉంటుంది. ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా మోడీ ప్ర‌తిష్ట మ‌స‌క‌బారుతుండ‌టంతోపాటు కొవిడ్ రెండోద‌శలో ఆయ‌న వైఫల్యాన్ని ప్ర‌పంచ‌మంతా వేలెత్తిచూపింది. ప్ర‌తిప‌క్షాల‌న్నీ క‌లిసి మ‌మ‌తాబెన‌ర్జీని ప్ర‌ధాన‌మంత్రి అభ్య‌ర్థిగా రంగంలోకి దింపే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ త‌న వ్యూహాల‌కు ప‌దునుపెడుతూ దేశంలోని ఎన్డీయేత‌ర ప‌క్షాల‌న్నింటినీ ఒకేవేదిక‌పైకి తీసుకురావ‌డానికి ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల‌కు, రాజ్య‌స‌భ‌లో బిల్లులు నెగ్గించుకోవ‌డానికి వైసీపీ అవ‌స‌రం బీజేపీకి బాగావుంది. ఇటువంటి త‌రుణంలోనే పార్ల‌మెంటులో వైసీపీ స‌భ్యులు స్పీక‌ర్ పోడియంను చుట్టుముట్టడంతోపాటు ప్ర‌ధాన‌మంత్రిపై విమ‌ర్శ‌లు చేస్తుండ‌టం కూడా ఆస‌క్తిక‌రంగా మారింది.

అన‌ధికారికంగా అంతా స‌హ‌క‌రిస్తూనే ఉన్నాం
అధికారికంగా ఎటువంటి పొత్తు లేక‌పోయినా అన‌ధికారికంగా ఎన్డీయేకు పూర్తిగా స‌హ‌క‌రిస్తోన్న వైసీపీ ప్ర‌స్తుతం ప్ర‌ధాన‌మంత్రిపై గుర్రుగా ఉంది. ఎన్నిర‌కాలుగా స‌హ‌క‌రిస్తున్నా త‌మ‌కు కావ‌ల్సింది మాత్రం చేయ‌డంలేద‌ని ఆగ్రహం వ్య‌క్తం చేస్తోంది. ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు తెలుగుదేశం పార్టీతో అంట‌కాగుతూ త‌మ‌పై విమ‌ర్శ‌లు చేస్తూ ఇబ్బందుల‌కు గురిచేస్తోన్నా చ‌ర్య‌లు తీసుకోవ‌డంలేద‌ని లోలోనే ర‌గిలిపోతోంది. ఈ విష‌యంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఇప్ప‌టికే అమిత్ షాను ప్ర‌త్యేకంగా క‌లిసి ర‌ఘురామ విష‌యాన్ని ఆయ‌న దృష్టికి తీసుకువెళ్లారు. ఆ పార్టీ ఎంపీలంతా ప్ర‌ధాన‌మంత్రిని క‌లిశారు. అయినా ర‌ఘురామ‌ను ఎందుకు స‌స్పెండ్ చేయ‌డంలేదో ఆ పార్టీ నేత‌ల‌కు అర్థం కాకుండా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఆ పార్టీ ఎంపీలు ఇప్పుడు పార్ల‌మెంటులో గ‌లాటా సృష్టిస్తున్నారు. ఇప్ప‌టికే న‌త్వానీకి ఒక రాజ్య‌స‌భ సీటు ఇచ్చారు. త్వ‌ర‌లో ఇంకో రాజ్య‌సభ సీటు కావాల‌ని బీజేపీ పెద్ద‌లు కోర‌నున్నారు. అయిన‌ప్ప‌టికీ ర‌ఘురామ‌ను స‌స్పెండ్ చేసే విష‌యంలో మాత్రం కేంద్రం ఏమీ మాట్లాడ‌టంలేదు. అవ‌స‌రం ఎవ‌రిదో తెలుసుకాబ‌ట్టి వారే లొంగివ‌స్తార‌నే భావ‌న కేంద్ర పెద్ద‌ల‌కు ఉండొచ్చ‌ని వైసీపీ వ‌ర్గాలు భావిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

tag