ఏం చేద్దాం ఇప్పుడు : భ‌జ‌న చేశారు  కానీ ప‌ద‌వి ద‌క్క‌లేదు..  


మీరు ఏమ‌యినా చేయండి కానీ అతి చేయ‌కండి.. మీరు ఏమ‌యినా రాయండి కానీ లేనిది ఉన్న విధంగా సృష్టించి మీ మీ సృజ‌న‌కు ప‌దును పెట్ట‌కండి అనంటూ త‌రుచూ జ‌గ‌న్ త‌న అనుచ‌రుల‌తో ముఖ్యంగా మీడియా వ‌ర్గాల‌తో చెబుతారు. అదే పాటించ‌మ‌ని కూడా ఆదేశాలు ఇస్తారు. కానీ ఓ వెబ్ మీడియా అదేవిధంగా మాస ప‌త్రిక‌ను సైతం న‌డిపే ఆ సంస్థ ఎన్నో సార్లు జ‌గ‌న్ త‌మ వాడే అన్నంత‌గా బిల్డ‌ప్పులు ఇచ్చింది. టీడీపీ పై అస‌త్య క‌థ‌నాలూ అల్లించింది.. ప‌వ‌న్ ను సినిమా ప‌రంగానూ తిట్టింది.. ఇంత చేశాక ఆఖ‌రికి జ‌గ‌న్ వాళ్ల‌ను ఎందుక‌నో దూరం పెట్టారు.. అమ‌రావ‌తి స‌ర్కిల్స్ లో ఏదో ఒక ప‌ద‌వితో ఊరేగుదాం అనుకున్న ఆ ప‌త్రిక పెద్ద‌ల‌కూ, వెబ్ మీడియా కంటెంట్ రైట‌ర్ల‌కూ నిజంగా ఇది నిర్ఘాంత పోయే విషయ‌మే! ఇంకా చెప్పాలంటే మార్కెట్లో కి ప్ర‌భుత్వ ప‌క్షాన వ‌చ్చే ఆంధ్ర ప్ర‌దేశ్ మ్యాగ్జైన్ క‌న్నా సాక్షి ప‌త్రిక క‌న్నా మేమే టాప్ అన్నంత బిల్డ‌ప్ ఇచ్చి బొక్క‌బోర్లా ప‌డింది. కానీ ఇదే స‌మ‌యంలో మ‌రో  ప్ర‌ముఖ సంస్థ సీఈఓకు చీఫ్  డిజిట‌ల్  డైరెక్ట‌ర్ ప‌ద‌వి ఇచ్చి నెత్తిన పెట్టుకుంది ఏపీ స‌ర్కార్ .. 



ఒక ప‌త్రిక కూ సీఎం జ‌గ‌న్ కూ మ‌ధ్య విభేదం.. ఒక ప‌త్రిక కూ సీఎం జ‌గ‌న్ కూ మిత్ర భేదం అని రాయాలి..ఎందుకంటే నిన్న‌టి దాకా వాళ్లంతా జ‌గ‌న్ స‌ర్ అభిమానులు.. జ‌గ‌న్ ను అతిగా ప్రేమించిన పాత్రికేయులు..ఆయ‌న‌పై ఈగ అయినా వాల‌నీయ‌ని భ‌క్తులు అని రాయ‌డం ఇంకా మేలు.. కానీ జ‌గ‌న్ ఈ అతి పొగ‌డ్త‌ను ప‌ట్టించుకోలేదు.. సంపాద‌కీయాల పేరిట అదే ప‌నిగా ఆయ‌న నామ జ‌పం చేయ‌డం ఆయ‌న‌కు ఏ కొంచెం  కూడా ఇష్టం లేకుండా పోయింది. ఫ‌లితంగా వాళ్లు ఆశించిన రీతిలో ఏపీ స‌ర్కార్ నుంచి ఎటువంటి తాయిలాలూ అంద‌లేదు.. నామినేటెడ్ పోస్టులూ ద‌క్క‌లేదు. అంతేకాదు అస‌లు వాళ్ల‌ను ప‌ట్టించుకునే స్థితిలోనే ఏపీ స‌ర్కార్ లేదు. 


ఇదంతా ఎందుకు కానీ ఎన్నిక‌ల ముందు సీన్ లోకి వెళ్లొద్దాం..ఆ రోజు ఆయ‌న పాద‌యాత్ర‌కు విప‌రీత‌మ‌యిన క్రేజ్ ఇచ్చిందా మీడియా.. వారి వెబ్ కూడా.. అదే రీతిన రాత‌లు రాస్తూ పోయింది. జ‌గ‌న్ ను టార్గెట్ చేసే వాళ్లెవ‌ర‌యినా త‌మ వ‌ర్గ శ‌త్రువుగా భావించి చంద్ర‌బాబు మొద‌లుకొని ప‌వ‌న్ వ‌ర‌కూ తిట్టిపోసింది.. నోటికివ‌చ్చిన రీతిన రాస్తూ పోతూ  తిడుతూ పోతూ ఏవో క‌థ‌నాలు వండి వార్చింది. మార్కెట్లో జ‌గ‌న్ మావాడే అని చెప్పుకుని తిరిగింది. ఇదంతా అయ్యాక జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చాక కూడా అలానే భ‌జ‌న చేస్తూ పోయింది. కానీ ఆ స్వామి భ‌క్తిని జ‌గ‌న్ ప‌ట్టించుకోలేదు. ద‌క్కుతుంద‌న్న నామినేటెడ్ పోస్టులు ఏవీ ద‌క్క‌లేదు.. అవ‌న్నీ  స‌రే ఐ అండ్ పీఆర్ యాడ్స్ కు కూడా అక్క‌డ ఇవ్వ‌లేదు ఏపీ స‌ర్కార్.. ఇప్పుడు ఏం చేయాలో తోచ‌క జ‌గ‌న్ పై క‌త్తి దూస్తోంది.. వెర్రిమొర్రి రాత‌లు రాస్తోంది. ఆయ‌న పాల‌న బాలేద‌ని, క్షేత్ర స్థాయిలో అందుకు నిద‌ర్శ‌నాలు బోలెడు ఉన్నాయ‌ని  మ‌ళ్లీ ఏవేవో క‌థ‌నాలు వండి వారుస్తోంది.. ఇదంతా ఎలా ఉంది అంటే అందితే జుత్తు లేదంటే కాలు.. అన్న రీతిన ఉంద‌ని వైసీపీ  శ్రేణులు విస్తుబోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: