జమ్మూ, హిమాచల్ ప్ర‌దేశ్ లో ఆకస్మిక వరదలు భీబ‌త్సం సృష్టిస్తున్నాయి. ఇప్ప‌టికే వ‌ర‌ద‌లు, కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డిన ఘ‌ట‌న‌ల్లో ప‌లువురు ప్రాణాల‌ను కోల్పోయారు. కాగా తాజాగా వ‌ర‌ద‌ల భీబ‌త్సానికి మ‌రో 16 మంది మృతి చెందారు. అంతే కాకుండా పలువురు గల్లంతు అయ్యారు. అంతే కాకుండా ఆక‌స్మిక వ‌ర‌ద‌ల కార‌ణంగా ఇళ్లు, పంటలు సైతం ధ్వంసమయ్యాయి. దాంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. హిమాచల్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన‌ట్టు తెలుస్తోంది. మ‌రో ఏడుగురు గల్లంతయ్యారని స‌మాచారం. మ‌రోవైపు ఉదయ్‌పుర్‌ ప్రాంతంలో 12 మంది కార్మికులు వరదల్లో కొట్టుకుపోయారు. కాగా వారిలో ఏడు గురి మృతదేహాలు ఇప్ప‌టికే లభ్యమయ్యాయి. 

కొట్టుకుపోయిన వారిలో ఇద్దరిని సహాయక సిబ్బంది ఎంతో క‌ష్ట‌ప‌డి రక్షించారు.కాగా మ‌రో ముగ్గురి ఆచూకీ కోసం స‌హాయ‌క సిబ్బంది వెతుకుతున్నారు. ఇదిలా ఉండగా కుల్లూ జిల్లాలోని పార్వతి నదిలో నీటి ప్రవాహం ఒక్క‌సారిగా పెరగడంతో నలుగురు చనిపోయారని అధికారులు చెబుతున్నారు. చంబా జిల్లాలో వ‌ర‌ద‌ల ఉదృతికి ఇద్దరు మృతి చెందిన‌ట్టు తెలుస్తోంది. జమ్ములోని కిశ్త్‌వాఢ్‌లో ఓ గ్రామాన్ని ఆకస్మికంగా వరదలు ముంచెత్తాయి. ఈ ఘటనలో మొత్తం ఏడుగురు గ్రామ‌స్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న‌తో గ్రామంలో విశాదం నిండుకుంది. వ‌ర‌ద‌ల కార‌ణంగా కార్గిల్‌లో ఓ మినీ హైడల్‌ ప్రాజెక్టుకు నష్టం వాటిల్లింది.

కొండ‌ల పై నుండి వ‌ర‌ద‌ల‌కు రాళ్లు విరిగి ఒక్క‌సారిగా ప్రాజెక్టును ఢీ కొట్ట‌డంతో ప్రాజెక్టుకు న‌ష్టం జ‌రింగింది. అంతే కాకుండా అమర్‌నాథ్‌ పవిత్ర గుహ సమీపంలోనూ కుండపోత వర్షం కురుస్తూనే ఉంది. అయితే ఇప్ప‌టి వర‌కూ మాత్రం ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లలేదని స‌మాచారం. ఇక  జమ్ములో వ‌ర‌ద‌ల కార‌ణంగా ఏర్ప‌డిన‌ పరిస్థితిని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సమీక్షించారు. ఈ నేప‌థ్యంలో అమిత్ షా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హాతో ఫోన్‌లో మాట్లాడి అక్క‌డి ప‌రిస్థితుల‌పై ఆరా తీశారు. ఇక వరదల వ‌ల్ల త‌లెత్తుతున్న‌ పరిస్థితిని కేంద్రం పర్యవేక్షిస్తోందని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: