ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల ప్రస్తావన సందర్భంగా తెరపైకి పచ్చిన అంశం శాసనమండలి రద్దు. మండలిలో సరైన మెజారిటీ లేని కారణంగా జగన్ సర్కార్ ప్రతిపాదించిన 3 రాజధానుల బిల్లుకు పెద్దల సభలో బ్రేక్ పడింది. మండలి ఛైర్మన్ తన విశేష అధికారాలతో బిల్లును పరిశీలన కోసం పంపారు. ఇక అంతే... ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కోపం వచ్చింది. ప్రజల చేత ఎన్నుకున్న సభ్యులు బిల్ పాస్ చేస్తే... పరోక్షంగా ఎన్నికైన వారు ఎలా అడ్డుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు పెద్దల సభ అవసరమా అంటూ ప్రస్తావించారు కూడా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొదట్లో తగిన మెజారిటీ లేకపోవడంతో చాలా బిల్లులకు పెద్దల సభలో బ్రేక్ పడింది. అదే సమయంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి మండలిలో మెజారిటీ ఉండటంతో... ప్రతి అంశం కూడా పెద్దల సభలో ప్రభుత్వానికి తలనొప్పి తెచ్చేలా మారింది. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. అసలు పెద్దల సభ అవసరమా అని ఒక దశలో స్వయంగా సీఎం వైఎస్ జగన్ శాసనసభలోనే ప్రస్తావించారు. గతంలో మేధావుల కోసం పెద్దల సభ ప్రారంభించారని... కానీ ఇప్పుడు చాలా మంది విద్యావంతులు, మేధావులు ప్రస్తుతం శాసనసభలో ఉన్నారని జగన్ తెలిపారు.

పెద్దల సభ వల్ల పెద్దగా ఉపయోగం లేదని భావించిన సీఎం జగన్... శాసనమండలిని రద్దు చేయాలంటూ కేంద్రానికి ప్రతిపాదనలు కూడా పంపారు. అయితే అప్పుడే జగన్ ఆలోచనను సొంత పార్టీ నేతలే వ్యతిరేకించారు. రాజకీయ నిరుద్యోగులు చట్ట సభలకు వెళ్లాలంటే ఒకేఒక్క మార్గం శాసనమండలి. ఎన్నికల సమయంలో సీటు ఆశించి భగపడిన వారికి అన్ని పార్టీలు ఇచ్చే హామీ ఎమ్మెల్సీగా అవకాశం. ఆరేళ్ల పాటు చట్టసభలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంటుంది. జగన్ నిర్ణయంతో ఆ ఆశలన్నీ అడియాశలయ్యాయి. అదే సమయంలో కొద్ది రోజులు ఆగితే చాలు... టీడీపీ నేతల కాలపరిమితి తీరిపోతుంది కాబట్టి.... మన పార్టీ వాళ్లే మళ్లీ ఎన్నికవుతారు కాబట్టి... ఎలాంటి సమస్య రాదు అని కూడా బాహాటంగానే వ్యాఖ్యానించారు కొందరు. కానీ రద్దు చేయాలనే బిల్లును కేంద్రానికి పంపడంతో జగన్ మాటకు ఎదురుచెప్పలేక మిన్నకుండిపోయారు.

కానీ ఆ బిల్లును కేంద్రం ఏడాదిన్నర కాలంగా పెండింగ్ లో పెట్టింది. ఇంతలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. మండలిలో వైసీపీ బలం క్రమంగా పెరుగుతోంది. ప్రతిపక్ష సభ్యుల కాలపరిమితి ముగియడంతో వారి స్థానంలో అధికార పార్టీ నేతలు కొలువుతీరారు. ఈ పరిస్థితుల్లో మండలి రద్దు అంశం మరోసారి చర్చనీయాంశమైంది. శాసనమండలి రద్దు అంశాన్నిరాజ్యసభలో ప్రస్తావించారు టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రబాబు. దీనికి కేంద్ర మంత్రి కిరణ్ రిజూజ్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. మండలి రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. కేంద్ర మంత్రి ప్రకటనతో కొత్తగా పదవి చేపట్టిన వారికే కాకుండా... పెద్దల సభ కోసం ఆశలు పెట్టుకున్న వారిలో భయాందోళన రేకెత్తిస్తోంది. చూద్దాం ఏం జరుగుతుందో మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: