మెగాస్టార్ చిరంజీవి చాలా రోజుల నుంచి రాజకీయాలకు దూరంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన రాజకీయాల గురించి ఏమీ మాట్లాడడం లేదు కానీ కాంగ్రెస్ వాళ్లు మాత్రం చిరంజీవి మా వాడు అని చెప్పుకుంటారు.. చిరంజీవి రాజకీయాలు ప్రస్తావించకుండా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సాన్నిహిత్యం అయితే కొనసాగిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో పెద్దగా వ్యవహరిస్తున్న చిరంజీవి ఇండస్ట్రీ కోసమే ఒక పక్క జగన్ మరో పక్క కేసీఆర్తో సన్నిహితంగా వ్యవహరిస్తున్నారని చిరంజీవి ఫ్యాన్స్ చెబుతూ ఉంటారు. అయితే అనూహ్యంగా తెలంగాణలో రేవంత్ రెడ్డికి పిసిసి పగ్గాలు అప్పగించడంతో ఆయన చాలా యాక్టివ్ అయ్యారు. 


ఇతర పార్టీల్లో అసంతృప్తులను కాంగ్రెస్ లో ఉండి కూడా సైలెంట్ గా ఉన్న నేతలను కలుస్తూ వెళ్తున్న రేవంత్ రెడ్డి తాజాగా చిరంజీవితో భేటీ అయ్యారని తెలుస్తోంది. అంతేకాక చిరంజీవిని తీసుకుని రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీని కలిసే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. చిరంజీవికి రెండు తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన క్రేజ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఎలాగూ చిరంజీవినీ కాంగ్రెస్ పార్టీ వాడుకునే పరిస్థితి లేదు. అక్కడ కాంగ్రెస్ పార్టీ మనుగడనే ప్రశ్నార్థకం గా మారుతున్న క్రమంలో చిరంజీవిని తీసుకువెళ్లి సోనియాగాంధీతో భేటీ అయ్యేలా చేసి ఆ తర్వాత ఎన్నికల ముందు కాంగ్రెస్ కోసం ఆయన ప్రచారం నిర్వహించేలా చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది.


నేరుగా సోనియా గాంధీ నుంచి చిరంజీవికి పిలుపు వచ్చేలా చేసి ఆయనతో కలిసి వెళ్లి ఈ వ్యవహారం అంతా సోనియా గాంధీ చేత చెప్పించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వీరితో పాటు కిరణ్ కుమార్ రెడ్డిని కూడా తీసుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకు కిరణ్ కుమార్ రెడ్డిని కూడా యాక్టివ్ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ తెలంగాణలో కాంగ్రెస్ సత్తా చాటితే అప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో కూడా చిరంజీవి చేత ప్రచారం చేయించి కాంగ్రెస్ కు నూతన ఉత్తేజం తెప్పించేలా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: