నువ్వెవ‌రు?  నా ఇంటికొచ్చి తాళం వేయ‌డానికి?  ఎవ‌రు చెప్పారు నీకు?  నాగురించి ఏమ‌నుకుంటున్నావ్‌? అంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి న‌క్కా ఆనంద్‌బాబు పోలీస్ అధికారిపై నిప్పులు కురిపించారు. మీరు లోప‌లికి వెళ్లండి సార్‌.. రెండునిముషాలు మాకు ద‌య‌చేసి స‌హ‌కరించండి సార్‌.. అంటూ ఆ పోలీస్ అధికారి న‌చ్చ‌చెప్పేందుకు ప్ర‌య‌త్నించారు. ఇదంతా గుంటూరులోని న‌క్కా ఆనంద్‌బాబు నివాసం వ‌ద్ద జ‌రిగిన విష‌యం. కొండ‌ప‌ల్లి వ‌ద్ద అక్ర‌మ మైనింగ్ జ‌రుగుతుందోని తెలుగుదేశం పార్టీ ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. దీనిపై ఆ పార్టీ ఒక నిజ‌నిర్థార‌ణ క‌మిటీని ఏర్పాటు చేసింది. మైనింగ్ జ‌రిగే ప్ర‌దేశాన్ని ప‌రిశీలించేందుకు తాము రేపు కొండ‌ప‌ల్లి వెళుతున్న‌ట్లు సభ్యులు ప్ర‌క‌టించారు. దీంతో పోలీసులు రాష్ట్ర‌వ్యాప్తంగా ఎక్క‌డుంటే అక్క‌డ క‌మిటీ స‌భ్యుల‌ను అడ్డుకున్నారు. మాజీ మంత్రి న‌క్కా ఆనంద్‌బాబు ఈ క‌మిటీలో స‌భ్యుడిగా ఉండ‌టంతో ఆయ‌న గుంటూరులో గృహ‌నిర్బంధం చేశారు.

నాకు ప‌నులున్నాయి.. నేను బ‌య‌ట‌కు వెళ్లాలి
గుంటూరులో నక్కా ఆనంద్‌బాబును గృహనిర్బంధం చేసి పోలీసులు ఇంటి త‌లుపుల‌కు తాళం వేశారు. దీనిపై న‌క్కా పోలీసుల‌ను తీవ్రంగా ప్ర‌తిఘ‌టించారు. త‌న‌కు వ్య‌క్తిగ‌త ప‌నులు చాలావున్నాయ‌ని, తాను బ‌య‌ట‌కు వెళ్లాల‌ని, త‌న‌ను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ నిలదీశారు. త‌న ఇంటికి వ‌చ్చి త‌లుపులు వేసి తాళాలు వేసే హ‌క్కు ఎవ‌రిచ్చారంటూ వారిపై మండిప‌డ్డారు. పోలీసులు న‌చ్చ‌చెప్ప‌డానికి ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ ఆయ‌న ప‌ట్టువీడ‌లేదు. వారిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  "సమస్యే లేదు... నువ్వెవ‌రు? అడ్డం పడొద్దు.. నువ్వొచ్చి న‌న్ను ఆపేదేంటి?  నేను వెళ్లితీరుతానంటూ ప‌ట్టుద‌ల‌కు పోయారు. అయినా పోలీసులు మంత్రిని గృహ‌నిర్బంధం చేశారు.

దేవినేని ఉమాను అరెస్ట్ చేశారు
కొండ‌ప‌ల్లి ప్రాంతంలో అక్ర‌మ మైనింగ్‌కు సంబంధించి రాష్ట్రంలో వివాదం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. మాజీ మంత్రి దేవినేని ఉమాను ఈ కేసులోనే అరెస్ట్ చేసి ఎస్సీ, ఎస్టీ, ఎట్రాసిటీ కేసులు పెట్ట‌డంతోపాటు హ‌త్యాయ‌త్నం కేసు న‌మోదుచేసి రాజ‌మండ్రి కేంద్ర కారాగారానికి త‌ర‌లించారు. మొత్తం ప‌దిమందితో చంద్ర‌బాబునాయుడు క‌మిటీని ఏర్పాటు చేశారు. వీరంతా రేపు ఉద‌యం కొండ‌ప‌ల్లి వెళ్లి అక్క‌డ జ‌రుగుతున్న అక్ర‌మ మైనింగ్‌ను ప‌రిశీలించాల్సి ఉంది. మ‌రో స‌భ్యుడు బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావును కూడా విజ‌య‌వాడ‌లో అరెస్ట్ చేశారు. కొండ‌ప‌ల్లిలో మైనింగ్ జ‌రిగే ప్రాంతంవ‌ద్ద పోలీసులు భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.








మరింత సమాచారం తెలుసుకోండి:

tag