ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం మ‌త‌మార్పిళ్ల‌ను ప్రోత్స‌హిస్తోందంటూ భార‌తీయ జ‌న‌తాపార్టీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు వ్యాఖ్య‌ల‌పై విద్యుత్తుశాఖ మంత్రి బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి మండిప‌డ్డారు. వైసీపీ ప్ర‌భుత్వ‌మే మ‌త‌మార్పిళ్ల‌కు కార‌ణ‌మైతే ముఖ్య‌మంత్రి బంధువులమైన తామంతా ముందు మ‌తం మారాల‌ని, ఎందుకు మార‌లేద‌ని ప్ర‌శ్నించారు. సోము వీర్రాజు చేస్తున్న వ్యాఖ్య‌ల‌వ‌ల్ల న‌ష్టం క‌లుగుతోంద‌ని, అలాంటి ప‌రిస్థితితులు రాష్ట్రంలో లేవ‌ని, తామంతా హిందువులుగానే ఉన్నామ‌ని బాలినేని స్ప‌ష్టం చేశారు.
జ‌గ‌న్‌ను ల‌క్ష్యంగా చేసుకొని మాత్ర‌మే ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని విమ‌ర్శించారు.

అన్ని మ‌తాల‌ను, అన్ని కులాల‌ను స‌మానంగా చూస్తున్నారు
ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అన్ని మ‌తాల‌ను, అన్ని కులాల‌ను స‌మ‌దృష్టితో చూస్తున్నార‌ని, వైసీపీ ప‌రిపాల‌న కూడా కుల‌, మ‌త రాజ‌కీయాల‌కు అతీతంగా జ‌రుగుతోంద‌నే విష‌యాన్ని సోము గుర్తెర‌గాల‌న్నారు. మౌజ‌న్ల‌తోపాటు పూజారుల‌కు కూడా ప్ర‌భుత్వం వేత‌నాలు చెల్లిస్తోంద‌ని, ఈ విష‌యాన్ని కూడా ఒక‌సారి గుర్తుంచుకోవాల‌న్నారు. తిరుమ‌ల‌తో స‌హా రాష్ట్రంలోని అన్ని దేవాల‌యాల‌కు ముఖ్య‌మంత్రి వెళ‌తార‌నే విష‌యం తెలియ‌దా? అని ప్ర‌శ్నించారు. మ‌న‌దేశం లౌక‌కి దేశ‌మ‌ని, ఎవ‌రు ఏ మ‌తమైనా అనుస‌రించ‌వ‌చ్చ‌ని బాలినేని అన్నారు. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు ఆశించి చేసే ఇటువంటి వ్యాఖ్య‌లు భ‌విష్య‌త్తులో చేయ‌కుండా ఉంటే మంచిద‌ని హిత‌వు ప‌లికారు. జ‌ల వివాదాల‌పై మాట్లాడుతూ చంద్రబాబు ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే విధంగా రాజ‌కీయాలు చేస్తున్నార‌ని, ఆయ‌న‌కు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ సర్కారుకు లేఖ రాయాలని సూచించారు.

భార‌తీయ జ‌న‌తాపార్టీ దేవాల‌యాల‌ యాత్ర‌
భార‌తీయ జ‌న‌తాపార్టీ నేత‌లు రాష్ట్రంలో ఆల‌యాల యాత్ర చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ముఖ్య‌మంత్రిగా వైఎస్ జ‌గ‌న్ అధికారం చేప‌ట్టిన నాటినుంచి వివాదాల‌కు కార‌ణ‌మైన ఆల‌యాల‌ను, విగ్ర‌హాలు ధ్వంస‌మైన ఆల‌యాల‌ను ఈ నేత‌లంతా ప‌రిశీలిస్తున్నారు. ఈ యాత్ర‌వ‌ల్ల హిందువుల ఓట్ల‌ను స‌మీకృతం చేసి బీజేపీ ఓటుబ్యాంకుగా మార్చాల‌నేది ఆ పార్టీ నేత‌ల ఆలోచ‌న‌గా ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే మ‌త‌ప‌రంగా ఓటుబ్యాంకు రాజ‌కీయాలు చేయ‌డం ఉత్త‌రాది రాష్ట్రాల్లో వీల‌వుతుందికానీ  ద‌క్షిణాది రాష్ట్రాల్లో కుద‌ర‌వ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి:

tag