బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి....ఏపీ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టిన బైరెడ్డి...ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. నందికొట్కూరు నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇలా టీడీపీ కీలకంగా పనిచేసిన బైరెడ్డి ఊహించని విధంగా టీడీపీ నుంచి బయటకొచ్చేశారు. అలాగే రాయలసీమ పరిరక్షణ సమితి పెట్టి రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. రాష్ట్ర విభజన సమయంలో రాయలసీమ హక్కులు కోసం గట్టిగానే పోరాడారు.

అయితే చివరికి తన పోరాటాన్ని పక్కనబెట్టి కాంగ్రెస్‌లో చేరి కొన్ని రోజులు రాజకీయం చేశారు. ఇక 2019 ఎన్నికల ముందు బైరెడ్డి, కాంగ్రెస్‌ని వదిలిపెట్టేశారు. అప్పుడు టీడీపీలోకి వచ్చి పోటీ చేస్తారని అంతా అనుకున్నారు. బైరెడ్డికి శ్రీశైలం టికెట్ దక్కే ఛాన్స్ ఉందని ప్రచారం జరిగింది. కానీ బైరెడ్డి టీడీపీ తరుపున బరిలో దిగలేదు. ఇక ఎన్నికలయ్యాక బైరెడ్డి బీజేపీలో చేరి రాజకీయాలు చేస్తూ వస్తున్నారు.

ప్రస్తుతం బీజేపీలో ఉన్న బైరెడ్డి పెద్దగా యాక్టివ్‌గా ఉంటున్నట్లు కనిపించడం లేదు. ఏదో అప్పుడప్పుడు మాత్రం మీడియా సమావేశాల్లో కనిపిస్తున్నారు. అటు బైరెడ్డి కుమార్తె శబరి కూడా రాజకీయాల్లో ఉన్నారు. అయితే వీరు బీజేపీలో అంత దూకుడుగా రాజకీయాలు చేస్తున్నట్లు కనిపించడం లేదు. అలా అని బైరెడ్డి బీజేపీలోనే కొనసాగే అవకాశాలు కూడా లేవని తెలుస్తోంది. ఎందుకంటే ఏపీలో బీజేపీ పరిస్తితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఏదో కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి, ఏపీలో ఆ పార్టీలో కాస్త నాయకులు కనిపిస్తున్నారు. అంతే గానీ ఇక్కడ బీజేపీకి భవిష్యత్ లేదనే చెప్పొచ్చు. అయితే బైరెడ్డి తనతో పాటు తన కుమార్తె రాజకీయ భవిష్యత్ బాగుండాలంటే వైసీపీ లేదా టీడీపీలోకి వెళ్లాల్సిన పరిస్తితి ఉంది. కానీ బైరెడ్డి, వైసీపీలోకి వెళ్ళడం కష్టమనే అని తెలుస్తోంది. ఇక వచ్చే ఎన్నికల ముందు పరిస్తితుల బట్టి మళ్ళీ టీడీపీలోకే వెళ్ళే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి చూడాలి బైరెడ్డి రాజకీయం ఎలా ఉంటుందో?  

మరింత సమాచారం తెలుసుకోండి: