ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ రాలేదు, కరోనా నేపథ్యంలో అసలు ఎన్నికలు ఉంటాయో లేదో తెలీదు, ఇంకా ప్రధాన పార్టీలు అభ్యర్థుల్ని ప్రకటించలేదు. అయినా హుజూరాబాద్ లో రాజకీయ వేడి ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలుసు. రేపు మాపో ఎన్నికలు, ప్రచారానికి నేడే చివరి రోజు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాయి ప్రధాన పార్టీలన్నీ. దళితబంధు పథకాన్ని కేసీఆర్ ప్రకటించిన తర్వాత ఈ వేడి మరింత పెరిగింది. అయితే ఈటల రాజేందర్ అస్వస్థతతో పాదయాత్రకు బ్రేక్ పడటంతో.. హుజూరాబాద్ హంగామాకు తాత్కాలిక విరామం వచ్చినట్టయింది.

ఇటీవల ఈటల రాజేందర్ బావమరిది వాట్సప్ చాట్ అంటూ.. కొన్ని స్క్రీన్ షాట్ ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి, ఆ తర్వాత ఈటల దళితులతో కాళ్లు కడిగించుకున్నారని, పాలాభిషేకం చేయించుకున్నారనే వీడియో కూడా చక్కర్లు కొట్టింది. మరోవైపు దళితబంధుని అడ్డుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కొంతమంది కలిశారు. వీరి వెనక ఈటల, బీజేపీ ఉందని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈటల చిక్కుల్లో పడ్డారు. ఆయనకు అడుగడుగునా వ్యతిరేకత వ్యక్తమవుతోందని, ఈటల పాదయాత్రలో నిరసనలు చోటు చేసుకుంటున్నాయని అధికార టీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది కూడా. ఒకరకంగా ఈటలను బాగానే కార్నర్ చేశారు. సరిగ్గా ఇదే సమయంలో ఈటలకు అస్వస్థత అంటూ వార్తలు రావడం, స్వయంగా ఆయనే పాదయాత్రకు బ్రేక్ ఇస్తున్నానని చెప్పడంతో ఈ వేడి అంతా ఒక్కసారిగా చల్లారింది.

హుజూరాబాద్ లో ఈటల పాదయాత్ర చేస్తున్నంత సేపు, అటు అధికార పార్టీ కూడా అక్కడ ఏదో ఒక కార్యక్రమంలో హడావిడి చేస్తోంది. మంత్రుల్ని, ఇతర నాయకుల్ని పంపించి యాక్టివిటీ మొదలు పెట్టింది. కానీ ఇప్పుడు ఈటల పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి సైలెంట్ అయ్యారు. అంటే, ఆటోమేటిక్ గా అధికార పార్టీ కూడా సైలెంట్ అయినట్టే లెక్క. అటు కాంగ్రెస్ హడావిడి ఇంకా మొదలు కాలేదు కాబట్టి కొన్నిరోజులపాటు హుజూరాబాద్ లో పొలిటికల్ హంగామా లేనట్టే.

మరింత సమాచారం తెలుసుకోండి: