క‌రోనా మ‌హ‌మ్మారిని అంత‌మొందించేందుకు ప్ర‌పంచ వ్యాప్తంగా వ్యాక్సిన్‌ను అందించేందుకు ఆయా ప్ర‌భుత్వాలు చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. ఎంత త్వ‌ర‌గా వీలైతే అంత త్వ‌ర‌గా టీకాను ప్ర‌జ‌ల‌కు అందించేందుకు అవ‌కాశాల‌ను వెతుకుతున్నాయి. అయితే క‌రోనా టీకాపై శాస్త్ర‌వేత్త‌లు అనేక ప‌రిశోధ‌న‌లు చేస్తూనే ఉన్నారు. ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక టీకాలు అందుబాటులో ఉన్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం ఇంజ‌క్ష‌న్ ద్వారా మాత్ర‌మే టీకాను ప్ర‌జ‌ల‌కు ఇస్త‌న్నారు. అయితే ఇక ముందు ముక్కుద్వారా క‌రోనా టీకా ఇచ్చేందుకు చుక్క‌ల‌మందును అభివృద్ధి చేస్తున్నారు. ఈ చుక్క‌ల మందు ద్వారా పంపిణీ సుల‌భంగా అవుంతుంది. దీంతో పాటు ప్ర‌జ‌ల‌కు సౌక‌ర్యంగా ఉంటుంది కూడా.

  మ‌న దేశానికి చెందిన‌ భారత్‌ బయోటెక్‌ నుంచి త్వ‌ర‌లోనే కొవిడ్‌-19 వ్యాధి నిరోధం కోసం ముక్కు ద్వారా ఇచ్చే చుక్కలమందు టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు క‌నిపిస్తోంది. దీనికి త‌గిన ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు,ఈ టీకాపై నిర్వహిస్తున్న క్లినికల్ ట్ర‌య‌ల్స్‌కు సంబంధించిన సమాచారం వచ్చే రెండున్నర నెలల్లో తెలుస్తుంద‌ని భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ సీఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్ల పేర్కొన్నారు.

 ఇప్పటికే భారత్‌ బయోటెక్  కొవాగ్జిన్ టీకాను విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే, దీనిని ఇంజ‌క్ష‌న్‌తో  ఇస్తున్నారు. ముక్కు ద్వారా, చుక్కల మందు రూపంలో టీకాను ఆవిష్కరించడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది భారత్‌ బయోటెక్‌. ఇందుకోసం వాషింగ్టన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ ఇన్‌ సెయింట్‌ లూయీస్‌తో లైసెన్సింగ్‌ ఒప్పందాన్ని ఈ కంపెనీ కుదుర్చుంది. అధిక జనాభా గల భార‌త దేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఈ తరహా టీకా ఉత్త‌మ‌మైన‌ద‌ని భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ సీఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్ల వివ‌రించారు.

తాజాగా ఫిక్కీ నిర్వహించిన సదస్సులో ముక్కు ద్వారా ఇచ్చే టీకాను నెలకు 10 కోట్ల డోసుల మేర త‌యారు చేయొచ్చని అని డాక్టర్‌ కృష్ణ ఎల్ల  వెల్లడించారు. ప్రస్తుతం ఇంజెక్షన్‌ ద్వారా ఇస్తున్న రెండు డోసుల కొవాగ్జిన్‌ టీకాకు బదులు.. మొదటి డోసులో కొవాగ్జిన్‌, రెండో డోసు కింద ముక్కు ద్వారా టీకా ఇస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయనే విష‌యంపై నిర్ధరించుకునే యత్నాల్లో భారత్‌ బయోటెక్‌ నిమగ్నమైంద‌ని తెలుస్తోంది. ఈ 'కాంబినేషన్‌ టీకా' విషయంలో తగిన ప్రయోగాలు నిర్వహించడానికి భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) ని భార‌త్ బ‌యోటెక్ అనుమతి కోరింది. దీంతో సత్ఫలితాలు వస్తే, కొవిడ్‌-19 వ్యాధిని ఎదుర్కొనేందుకు మరింత సామర్థ్యం లభిస్తుందని అభిప్రాయపడ్డారు డాక్టర్‌ కృష్ణ ఎల్ల.



మరింత సమాచారం తెలుసుకోండి: