కేకే. ఉమ్మ‌డి ఏపీ రాజ‌కీయాల్లో అందునా.. కాంగ్రెస్‌లో సుదీర్ఘ‌కాలం ప‌నిచేసిన నాయ‌కుడు కే.కేశ‌వ‌రావు. ఉర‌ఫ్ కేకే. ఎక్క‌డా అవినీతి, అక్ర‌మాలు.. విమ‌ర్శ‌లు.. ఫైర్‌బ్రాండ్ పేర్ల‌కు దూరంగా ఆయ‌న సుదీర్ఘ కాలంగా రాజ‌కీయాలు చేస్తున్నారు. కాంగ్రెస్‌లో ఉన్న‌ప్పుడు.. ఉమ్మ‌డి ఏపీలో పార్టీ అధ్య‌క్షుడిగా వ్య‌వ‌హ‌రించారు. త‌ర్వాత‌.. ప‌శ్చిమ బెంగాల్  కాంగ్రెస్ పార్టీ వ్య‌వ‌హారాల‌ ఇంచార్జ్‌గా వ్య‌వ‌హ‌రించారు. ఎక్క‌డా ఆయ‌న‌పై ఎవ‌రికీ వ్య‌తిరేక‌త లేదు. విమ‌ర్శ‌లూ రాలేదు. అలాగ‌ని.. ఆయ‌న పెద్ద పెద్ద ప‌ద‌వులు కూడా ఆశించ‌లేదు. త‌న మాట‌ల చ‌తుర‌త‌తో పార్టీని ముందుకు న‌డిపించారు. నాయ‌కుల‌ను స‌మ‌న్వ‌యం చేసుకున్నారు.
ఇలా కేకే కాంగ్రెస్ రాజ‌కీయాలు చేసినా.. అన్ని పార్టీల్లోనూ ఆయ‌న‌కు మంచి పేరుంది. అభిమానులు కూడా ఉన్నారు. ప్ర‌స్తుతం కేకే.. తెలంగాణ రాష్ట్ర స‌మితిలో కీల‌క నేత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. రాజ్య‌స‌భ స‌భ్యుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్‌కు అత్యంత స‌న్నిహితుడిగా ఆయ‌న పేరు తెచ్చుకున్నారు. ఇక, ఆయ‌న వార‌సురాలిగా.. రాజ‌కీయ అరంగేట్రం చేశారు.. కేకే కుమార్తె గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మి. ఉన్న‌త విద్యావంతురాలు.. మంచి మేధావిగా గుర్తింపు తెచ్చుకున్న‌ ఆమె తండ్రికి భిన్నంగా.. మంచి దూకుడు ఉన్న నాయ‌కురాలిగా పేరు తెచ్చుకున్నారు. స‌మ‌స్య ఎలాంటిదైనా.. ఎక్క‌డ ఉన్నా.. త‌క్ష‌ణం వాలిపోవ‌డం.. దానిని ప‌రిష్క‌రించ‌డం.. విజ‌యల‌క్ష్మికి రాజ‌కీయంగా అబ్బిన విద్య‌.
అదే స‌మ‌యంలో రాజ‌కీయ ఫైర్ బ్రాండ్ నాయ‌కురాలిగా కూడా విజ‌య‌ల‌క్ష్మి పేరు తెచ్చుకున్నారు. ప్ర‌తి ప‌క్ష నేత‌ల దూకుడుకు క‌ళ్లెం వేయ‌డంలోను.. మాట‌ల తూటాలు పేల్చ‌డంలోనూ త‌న‌కుతానే సాటి అని పించుకున్నారు. 2015లో గ్రేట‌ర్ హైద‌రాబాద్ మునిసిప‌ల్ ఎన్నిక‌ల‌తో రాజ‌కీయ అరంగేట్రం చేసిన విజ యల‌క్ష్మి.. ఆ ఎన్నిక‌ల్లో బంజారాహిల్స్ వార్డు నుంచి పోటీ చేసి.. టీఆర్ ఎస్ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌ల‌కు అత్యంత చేరువ‌య్యారు. స్థానికంగా ఎక్క‌డ ఎలాంటి స‌మ‌స్య ఉన్న‌ప్ప‌టికీ.. ఆమె ప్ర‌త్య‌క్ష‌మై.. ప‌రిష్క‌రించేందుకు కృషి చేశారు.
ఇటీవ‌ల క‌రోనా స‌మ‌యంలోనూ స్వ‌యంగా ప్ర‌జ‌ల‌కుచేరువై.. క‌రోనా క‌ట్ట‌డికి తీసుకోవాల్సిన చ‌ర్య‌లు వివ‌రిస్తూనే.. పేద‌ల‌కు.. ఉపాధికోల్పోయిన వారికి అండ‌గా నిలిచారు. త‌న వ్య‌క్తిగ‌త ఫోన్ నెంబ‌ర్‌ను ఇచ్చి మ‌రీ స‌మ‌స్య‌ల‌ను తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశారు. దీంతో విజ‌య‌ల‌క్ష్మికి ఇక్క‌డి ప్ర‌జ‌లు చాలా చేరువ య్యారు. ఇటీవ‌ల గ్రేట‌ర్ హైద‌రాబాద్‌కు జ‌రిగిన‌.. ఎన్నిక‌ల్లో మ‌రోసారి బంజారాహిల్స్ నుంచి పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్న విజ‌య‌ల‌క్ష్మి.. త‌ను సాధించిన ప్ర‌జాభిమానం కార‌ణంగా మేయర్ ప‌ద‌విని ద‌క్కించుకున్నారు. కేకే వార‌సురాలిగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చినా.. త‌న‌కంటూ.. ప్ర‌త్యేక స్థానం సాధించిన విజ‌య‌ల‌క్ష్మి.. ప్ర‌స్తుతం.. హైద‌రాబాద్ అభివృద్దికి ప్ర‌త్య‌క కార్యాచ‌ర‌ణ‌తో దూసుకుపోతుండ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: