తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటినుంచి ఏపీలో కూడా పీపీసీ అధ్య‌క్షుణ్ని మారుస్తున్నారంటూ చ‌ర్చ‌లు న‌డుస్తూనే ఉన్నాయి. ఏపీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్‌ఛార్జి ఉమెన్‌చాందీతో పార్టీ నేత‌లు ప‌లువురు ర‌హ‌స్యంగా భేటీ అయిన‌ట్లు స‌మాచారం. ఏపీలో ఇదే ప‌రిస్థితి ఎన్నిక‌ల‌వ‌ర‌కు కొన‌సాగితే క‌ష్ట‌మ‌ని, మార్పు దిశ‌గా అడుగులు త‌ప్ప‌వ‌ని ఆయ‌న సంకేతాలు ఇచ్చారు.

ప‌ద‌వుల‌ను త్యాగం చేయ‌డానికి సిద్ధంగా ఉండాలి
త‌న‌తో భేటీ అయిన నేత‌ల‌తో ఉమెన్‌చాందీ కీల‌క విష‌యాల‌ను చ‌ర్చించిన‌ట్లు తెలుస్తోంది. అధిష్టానం పార్టీ అధ్యక్షుణ్ని మార్చాల‌ని నిర్ణ‌యించింద‌ని, ప‌ద‌వుల‌ను త్యాగం చేసేందుకు అంద‌రూ సిద్ధంగా ఉండాల‌ని ఆయ‌న సూచించారు. ప్ర‌స్తుతం సాకే శైల‌జానాథ్ పీసీసీ చీఫ్‌గా ఉన్నారు. పార్టీకి దూరంగా ఉంటున్న ర‌ఘువీరారెడ్డిని తిరిగి పార్టీలోకి తీసుకొని ఆయ‌న‌కు ప‌గ్గాలిస్తే బాగుంటుంద‌ని కొంద‌రు నేత‌లంటున్నారు. అయితే మాజీ ముఖ్య‌మంత్రి న‌ల్లారి కిర‌ణ్‌కుమార్‌రెడ్డికి ప‌గ్గాల‌ప్ప‌గిస్తే కాంగ్రెస్ పార్టీ బ‌లోపేత‌మ‌వ‌డానికి అవ‌కాశం ఉంటుంద‌ని, ఆయ‌న‌కు ఇవ్వ‌డ‌మే మంచిద‌నే అభిప్రాయాన్ని మ‌రికొంద‌రు నేత‌లు వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో కిర‌ణ్‌కుమార్‌రెడ్డి అయితే ఓకే
ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ధీటుగా ఎదుర్కోవ‌డానికి, ప్ర‌తిప‌క్ష తెలుగుదేశం పార్టీని నిలువ‌రించ‌డానికి న‌ల్లారి వంటి నేత అవ‌స‌ర‌మ‌ని అధిష్టానం కూడా యోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఏపీలో కాంగ్రెస్ పార్టీకి అధ్య‌క్షుణ్ని అవ్వాలంటూ ఎప్ప‌టినుంచో ఆశ‌లు పెట్టుకున్న కేంద్ర మాజీ మంత్రి ప‌ళ్లంరాజు కూడా ఈ ప‌ద‌వి కోసం పోటీప‌డుతున్న‌ట్లు స‌మాచారం. తెలంగాణ‌లో ఉన్న‌ట్లుగా ఇక్క‌డ నేత‌లెవ‌రూ ప‌ద‌వి కోసం పోటీప‌డ‌కుండా ఉండ‌టం అధిష్టానానికి కాస్తంత ఉప‌శ‌మ‌నం క‌లిపిస్తోంది. కిర‌ణ్‌కుమార్‌రెడ్డి అయితేనే మంచిద‌నే యోచ‌న‌లో ఢిల్లీలోని నేత‌లు కూడా ఉన్నార‌ని, ఈ విష‌యం ఉమెన్‌చాందీవ‌ద్ద చ‌ర్చ‌కు వ‌చ్చింద‌ని ఆ స‌మావేశంలో పాల్గొన్న నేత ఒక‌రు అన్నారు. ఉమ్మ‌డి రాష్ట్రానికి చివ‌రిసారి ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన కిర‌ణ్‌కుమార్‌రెడ్డి ఆ త‌ర్వాత రాజ‌కీయాల్లో స్త‌బ్దుగా మారారు. ఇప్పుడు ఎంత‌వ‌ర‌కు చురుగ్గా రాజకీయాల్లో పాల్గొంటూ కాంగ్రెస్ పార్టీని బ‌లోపేతం చేస్తార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.





మరింత సమాచారం తెలుసుకోండి:

tag