ఎన్నిక‌ల వ్యూహాల్లో దిట్ట‌.. ప్ర‌త్య‌ర్థుల‌ను దెబ్బ‌తీయ‌డానికి ప్ర‌ణాళిక‌లు అల్ల‌డంలో విజ‌య‌వంతమ‌య్యే తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఏ నినాదం అందుకున్నా, ఏ అడుగు వేసినా ప్ర‌ణాళికా బ‌ద్ధంగా ఉంటుంది. దానివెన‌క అనేక రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌ను ఆయ‌న ఆశిస్తారు. తెలంగాణ రాష్ట్ర ఉద్య‌మం నుంచి హుజూరాబాద్ వ‌ర‌కు ఆయ‌న తీరును ప‌రిశీలిస్తే ఇదే అర్థ‌మ‌వుతుంది. తాజాగా తెలంగాణ రాష్ట్ర స‌మితి వ్యూహాత్మ‌కంగా కొత్త నినాదం అందుకుంది. క‌రెన్సీ నోట్ల‌పై రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బి.ఆర్‌.అంబేద్క‌ర్ బొమ్మ‌ను ముద్రించాల‌ని డిమాండ్ చేస్తోంది.

చ‌లో ఢిల్లీ క‌ర‌ప‌త్రం ఆవిష్క‌రించిన వినోద్‌కుమార్‌
కరెన్సీ నోటుపై జాతిపిత మ‌హాత్మాగాంధీ బొమ్మ ఉంటుంది. గాంధీ బొమ్మ‌తోపాటు డాక్ట‌ర్ అంబేద్క‌ర్ బొమ్మ‌ను కూడా ముద్రించాలంటూ కేసీఆర్‌కు అత్యంత విశ్వాస‌పాత్రుడు, తెలంగాణ ప్ర‌ణాళికా సంఘం ఉపాధ్య‌క్షుడు వినోద్‌కుమార్ డిమాండ్ చేస్తున్నారు. క‌రెన్సీ నోట్ల‌పై అంబేద్క‌ర్ బొమ్మ ఉండాలంటూ పోరాటం చేస్తోన్న సాధ‌న స‌మితి జాతీయ ప్ర‌తినిధులు వినోద్‌కుమార్‌తో స‌మావేశ‌మ‌య్యారు. వారు ఈ సంద‌ర్భంగా త‌మ‌కు మ‌ద్ద‌తివ్వాలంటూ ఆయ‌న్ను కోరారు. ఈనెల మూడు, నాలుగు, ఐదు తేదీల్లో చేప‌ట్టిన చ‌లో ఢిల్లీ పోస్ట‌ర్‌ను ఆయ‌న ఆవిష్క‌రించారు. ఇవ‌న్నీ కేసీఆర్‌కు తెలియ‌కుండా జ‌ర‌గ‌వు. ఎందుకంటే ఆయ‌న‌కు వినోద్ న‌మ్మిన‌బంటు. కాబ‌ట్టి కేసీఆర్ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తూ కేంద్రంపై ఒత్తిడిపెంచుతున్నారా? అనే కోణంలో కూడా ఈ విష‌యాన్ని చూడాల్సి ఉంటుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.

అంబేద్క‌ర్ బొమ్మ‌ను ముద్రించాలి
అంబేద్క‌ర్ బొమ్మ‌ను క‌రెన్సీ నోటుపై ముద్రించాల‌ని డిమాండ్ చేస్తున్న క‌మిటీ ప్ర‌తినిధుల కోర్కెన్యాయ స‌మ్మ‌త‌మైన‌దేన‌ని వినోద్ అన్నారు. ఈ అంశాన్ని పార్ల‌మెంటు వేదిక‌గా వినిపించాలంటూ పార్టీ ఎంపీల‌కు ఆయ‌న సూచించారు. ద‌ళిత బంధు ప‌థ‌కం పేరుతో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఒక ప‌థ‌కం అమ‌ల‌వుతోంది. హుజూరాబాద్ ఎన్నిక‌ల కోస‌మే దీన్ని ప్ర‌వేశ‌పెట్టార‌ని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శిస్తే అవును ప్ర‌వేశ‌పెట్టాను.. పెడితే త‌ప్పేంటి అంటూ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎదురు ప్ర‌శ్నించారు. అధికారంలో ఉన్నాం కాబ‌ట్టి ఇచ్చిన హామీలు నెర‌వేర్చే శ‌క్తి త‌మ‌కే ఉంటుంద‌ని, అందుకే ప్ర‌వేశ‌పెట్టామ‌న్నారు. హుజూరాబాద్ ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకొని అక్క‌డి ద‌ళిత ఓట్ల కోసం ఈ అంశాన్ని కూడా రాజ‌కీయ కోణంలో చూడాల్సి ఉంటుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

tag