విజయనగరం లోని మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారం ఎలా ఉంది అంటే అటు చైర్మన్ అశోక్ గజపతిరాజు ఇటు ప్రభుత్వం మధ్య వార్ అన్నట్లుగానే కథ నడుస్తోంది అని చెప్పాలి. ట్రస్ట్ ఏదైనా కూడా ప్రభుత్వ పర్యవేక్షణ ఉండాలి. అలాగే ప్రభుత్వానికి ట్రస్ట్ నిర్వాహకులు కూడా సహకరించాలి. ఇలా ఇద్దరి వైపు నుంచి సయోధ్య ఉంటేనే సజావుగా కార్యక్రమాలు సాగుతాయి. మాన్సాస్ ట్రస్ట్ కథ మాత్రం చాలా చిత్రం. ఇక్కడ చైర్మన్ గా ఉన్న అశోక్ టీడీపీకి చెందిన వారు. దాంతో సహజంగానే రాజకీయ యుద్ధం మొదలైపోతోంది. పైగా రాజు ముక్కుసూటి మనిషి. ఆయన తన దార్లోనే తాను వెళ్తారు. మరో వైపు చూస్తే వైసీపీ పెద్దలు కూడా పట్టుదలలకు పోతున్నారు.

ఈ మొత్తం వ్యవహారంలో బాగా నష్టపోయింది ఎవరూ అంటే ఉద్యోగులే అని చెప్పుకోవాలి. ఒక రోజు రెండు రోజులు కాదు ఏకంగా ఎనిమిది నెలలుగా వారికి జీతాలు లేవు. ట్రస్ట్‌కి సంబంధించిన వ్యవహారాలు చూసే ఈవో, చైర్మన్ ఆదేశాలను పక్కన పెడుతున్నారని అశోక్ దీని మీద హైకోర్టుకు వెళ్లారు. ఈవోను కోర్టు మందలించి చైర్మన్ చెప్పిన ప్రకారం వినాలని చెప్పింది. దాంతో ఇకనైనా జీతాలు ఉద్యోగులకు వస్తాయా అంటే ఎవరూ చెప్పలేని పరిస్థితి ఉంది మరో వైపు ట్రస్ట్ భూముల వ్యవహారం మీద కూడా రచ్చ అవుతోంది.

అటు సింహాచలం దేవస్థానం విషయంలో చూసుకుంటే ఏకంగా 800 ఎకరాలు మాయం అయ్యాయని దేవాదాయ శాఖ అధికారులు ప్రాధమికంగా నిర్ధారించారు.  వీటి విలువ పదివేల కోట్లు అని లెక్క తేల్చారు. అదే విధంగా మాన్సాస్ ట్రస్ట్ భూముల విషయంలో కూడా 150 ఎకరాలు భూములు రికార్డుల్లో కనిపించడంలేదు అంటున్నారు. ఇంకో వైపు తూర్పు గోదావరి జిల్లాలలో ఉన్న ట్రస్ట్ భూములలో అప్పట్లో టీడీపీ హయాంలో ప్రభుత్వ పెద్దల సహకారంలో కొంతమంది నాయకులు యధేచ్చగా ఇసుక తవ్వకాలు జరిపి కోట్లాది రూపాయలు ఆర్జించారు అన్న ఆరోపణలు ఉన్నాయి.

దీంతో మొత్తం ట్రస్ట్ భూముల కథను బయటకు తీసేందుకు సీఐడీతో విచారణ జరిపించాలని ఏపీ సర్కార్ ఆలోచిస్తోంది అంటున్నారు. ఈ విచారణ లోతుగానే ఉంటుందని అంటున్నారు. అదే విధంగా ఇందులో దోషులుగా ఎవరైనా తేలితే వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి అరేస్టుల దాకా కథ నడిపించాలని కూడా ఆలోచిస్తున్నారట. మొత్తానికి వదల బొమ్మాలి అన్నట్లుగా మాన్సాస్ ట్రస్ట్ విషయంలో  వివాదాలు వదలడంలేదు. చూడాలి ఇది ఎంతదాకా పోతుందో..!

మరింత సమాచారం తెలుసుకోండి: