కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గిపోతుందనుకున్న సమయంలో మళ్లీ దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయి. కేరళ లాంటి రాష్ట్రాలు పూర్తిగా లాక్ డౌన్ వైపు అడుగులేస్తున్నాయి. తమిళనాడు కూడా భయపడుతోంది. ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఈ దశలో స్కూల్స్, కాలేజీలు అంటే కాస్త కష్టమే. కానీ పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ మాత్రం ధైర్యంతో నిర్ణయం తీసుకున్నారు. రేపటినుంచి పంజాబ్ లో స్కూల్స్, కాలేజీలు తెరిచేందుకు అనుమతిచ్చారు.

పంజాబ్ లో ఆగస్ట్ 2నుంచి స్కూల్స్, కాలేజీలు తిరిగి మొదలు కాబోతున్నాయి. ఈ మేరకు అక్కడి ప్రభుత్వం తాజాగా ఆదేశాలిచ్చింది. అయితే కొవిడ్ నిబంధనల మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, కరోనా తిరిగి ప్రబలకుండా ముందస్తు చర్యలకు సిద్ధమయ్యామని చెబుతున్నారు అధికారులు. పంజాబ్ లో కరోనా కేసుల సంఖ్య నిలకడగా ఉండటం, యాక్టివ్ కేసుల సంఖ్య కూడా తగ్గుతూ వస్తుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

కరోనా కాలంలో స్కూల్స్, కాలేజీలు లేక విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆన్ లైన్ విద్యా బోధన ఉన్నా కూడా అది ప్రత్యామ్నాయం ఎంతమాత్రం కాదు అనే విషయం తేలిపోయింది. టెక్నాలజీ అందరికీ అందుబాటులో లేదు, అందులోనూ ఆన్ లైన్ బోధన వల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత ఏమాత్రం పెరగదని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. దీంతో పంజాబ్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిన తర్వాత 10, 11, 12 తరగతుల విద్యార్థులకు ఆఫ్ లైన్ బోధన మొదలు కాగా.. ఇప్పుడు మిగతా క్లాసులకి కూడా తరగతి గది బోధన ప్రారంభం అవుతుంది.

ఏపీలో ఆగస్ట్ 16నుంచి స్కూల్స్ తెరుచుకోవాల్సి ఉంది. కాలేజీల విషయంలో ఇప్పటికే ప్రభుత్వాలు ఓ నిర్ణయానికొచ్చేశాయి. వ్యాక్సిన్ వేయించుకున్నవారికి హాస్టల్స్ కూడా తెరుస్తున్నాయి. స్కూల్స్ విషయానికొస్తే ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామంటున్నారు అధికారులు. ఓ దశలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కూడా విమర్శలు చెలరేగగా.. ఇప్పుడు పంజాబ్ లాంటి రాష్ట్రాలు ముందడుగు వేయడం మరింత ఆశాజనకంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: