“కరోనా” వైరస్‌ తీవ్రత పెరుగుతోన్న కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, అస్సాం, మిజోరాం, మేఘాలయా, ఆంధ్రప్రదేశ్‌, మణిపూర్‌ రాష్ట్రాల అధికారులతో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా దాదాపు 46 జిల్లాల్లో “కొవిడ్‌” పాజిటివిటీ రేటు 10శాతం కన్నా ఎక్కువగా నమోదవుతున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి.  53 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5 నుంచి 10శాతం మధ్యలో ఉందని, ఈ జిల్లాల్లో నిర్లక్ష్యం వహిస్తే పరిస్థితులు మరింత క్షీణించే ప్రమాదముందని హెచ్చరించారు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి.

  80శాతం బాధితులు హోం ఐసోలేషన్‌లోనే ఉన్నందున వారిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని రాష్ట్రాలకు స్పష్టంగా సూచించింది కేంద్రం.  వైరస్‌ తీవ్రత పెరుగుతోన్న రాష్ట్రాల్లో “కొవిడ్‌” కట్టడి చర్యలు, టెస్టులు ముమ్మరం చేస్తూనే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతం చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచనలు చేసింది.   

60ఏళ్ల వయసుపైబడిన వారితో పాటు 45-60ఏళ్ల వారికి “కొవిడ్‌” మరణం ముప్పు  ఎక్కువగా ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తోన్న నేపథ్యంలో, వ్యాక్సినేషన్‌ వేగం పెంచాలని రాష్ట్రాలకు తెలిపింది కేంద్రం.  ఈ నేపథ్యంలో రెండో డోసు వారికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచనలు జారీ చేసింది కేంద్రం.  ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసుకునే విధంగా ప్రైవేటు ఆస్పత్రులను ప్రోత్సహించాలని తెలిపారు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి.  కొత్త వేరియంట్‌లను గుర్తించేందుకు విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల నమూనాలకు INSACOG సహాయంతో జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేపట్టాలని రాష్ట్రాలకు స్పష్టం చేసింది కేంద్ర ఆరోగ్యశాఖ. అన్ని రాష్ట్రాలలోనూ కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మాస్క్‌లు, శానిటైజర్లు, భౌతిక దూరం కచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. కరోనా మహమ్మారిని అసలు తేలిగ్గా తీసుకోకూడదని హెచ్చరించింది. ప్రతి ఒక్కరూ... కరోనా నిబంధనలు పాటిస్తేనే... ఈ మహమ్మారిని తరిమికొట్టవచ్చని పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: