గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ ఓట్లు చీల్చడం వల్ల పలువురు టీడీపీ నేతలు ఓటమి పాలైన విషయం తెలిసిందే. 2014 ఎన్నికల్లో పవన్ సపోర్ట్ చేయడం వల్ల కొన్ని స్థానాల్లో టీడీపీ ఓటమి నుంచి బయటపడి మంచి విజయాలు సాధించింది. అయితే 2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ విడిగా పోటీ చేయడం వల్ల పలు స్థానాల్లో జనసేన ఓట్లు చీల్చేసి టీడీపీకి డ్యామేజ్ చేసి, వైసీపీకి విజయం దక్కేలా చేసింది.

అలా పవన్ కల్యాణ్ ఎఫెక్ట్ వల్ల ఓటమి పాలైన వారిలో దివంగత జి‌ఎం‌సి బాలయోగి తనయుడు గంటి హరీష్ మాధుర్ కూడా ఒకరు. దివంగత బాలయోగి టీడీపీలో ఎలాంటి కీలక పాత్ర పోషించారో అందరికీ తెలిసిందే. ఆయన లోక్‌సభ స్పీకర్‌గా కూడా పనిచేశారు. బాలయోగి వారసుడుగా రాజకీయాల్లోకి వచ్చిన హరీష్ 2019 ఎన్నికల్లో అమలాపురం ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. టీడీపీ తరుపున బరిలో దిగిన హరీష్‌పై వైసీపీ తరుపున పోటీ చేసిన చింతా అనురాధ విజయం సాధించారు.

సుమారు 40 వేల ఓట్ల మెజారిటీతో హరీష్ ఓటమి పాలయ్యారు. అయితే ఇదే స్థానంలో జనసేనకు దాదాపు 2 లక్షల 55 వేల ఓట్లు వచ్చాయి. అంటే ఒకవేళ జనసేన, టీడీపీకి సపోర్ట్ చేసి ఉంటే ఫలితం ఎలా వచ్చేదో అర్ధం చేసుకోవచ్చు. 2014లో పవన్ సపోర్ట్ చేయడం వల్ల, ఇక్కడ టీడీపీ లక్షా 20 వేల ఓట్లపైనే మెజారిటీతో గెలిచింది.

ఎందుకంటే ఈ పార్లమెంట్ పరిధిలో పవన్ అభిమానులు, కాపు ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. అందుకే జనసేనకు అన్ని ఓట్లు వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో బాలయోగి వారసుడు గెలవాలంటే ఖచ్చితంగా పవన్ సపోర్ట్ తీసుకోవాల్సిన పరిస్తితి ఉంది. అంటే టీడీపీ-జనసేనల పొత్తు ఉంటేనే వైసీపీని ఎదురుకోగలరని తెలుస్తోంది. లేదంటే నెక్స్ట్ ఎన్నికల్లో కూడా 2019 ఎన్నికల ఫలితాలే రిపీట్ అయ్యేలా కనిపిస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: