అధ్యాపకుడుగా ఉన్న దాడి వీరభద్రరావును ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించి ఎమ్మెల్యే సీటు ఇచ్చారు. విశాఖ జిల్లాలోని వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన దాడి అనకాపల్లి నుంచి తిరుగులేని విజయం సాధించి టీడీపీలో కీలక నేతగా ఎదిగారు. ఆ పార్టీ నుంచి మంత్రిగా కూడా పనిచేశారు. అయితే దాడి 2004 ఎన్నికల్లో కొణతాల రామకృష్ణ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత చంద్రబాబు ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించారు. 2009 ఎన్నికల్లో మరోసారి ఆయన ఓడిపోవడంతో పాటు ఏకంగా మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 2014 ఎన్నికలకు ముందు దాడితో పాటు ఆయన కుమారుడు రత్నాకర్ వైసిపి కండువా కప్పుకుని చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. అనకాపల్లి సీటు కావాల‌ని వీరు ప‌ట్టుబ‌ట్టినా జగన్ మాత్రం విశాఖ నార్త్ వీరికి కేటాయించారు.

ఆ ఎన్నికలలో ర‌త్నాక‌ర్‌ ఓడిపోయారు. ఆ త‌ర్వాత దాడి వీర‌భ‌ద్ర‌రావు కొద్దిరోజులకే జగన్ పై తీవ్ర విమర్శలు చేసి టీడీపీలోకి జంప్ చేశారు. టిడిపిలో ఉన్నా ఆయనకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. 2019 ఎన్నికలకు ముందు మళ్లీ చంద్రబాబు ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి జగన్ ను పొగుడుతూ వైసీపీలోకి జంప్ చేశారు. అయితే ఈసారి మాత్రం జగన్ సీటు ఇవ్వలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటుతోంది. దాడి ఫ్యామిలీ గురించి అసలు పట్టించుకునే తీరిక వైసీపీ నేతలకు లేకుండాపోతోంది. చివ‌ర‌కు విజ‌య‌సాయి రెడ్డి కూడా వీరికి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంటే పార్టీలో దాడి ఆయన తనయుడు రత్నాకర్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది.

చివరకు ఇటీవల భర్తీ చేసిన నామినేటెడ్ పదవుల్లో కూడా దాడి ఆయన తనయుడు గురించి జగన్ పట్టించుకోలేదు. వాస్తవానికి దాడి కుమారుడు రత్నాకర్‌కు విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి ఇవ్వాలని అనుకున్నా... దాడి ఫ్యామిలీ తమకు ఎమ్మెల్సీయే కావాలని పట్టుబట్టింద‌ట‌. దీంతో జగన్ కు చిర్రెత్తుకు వచ్చి ఆ పదవి కూడా వెనక్కి తీసుకున్నారని విశాఖ వైసీపీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక విశాఖ జిల్లాలో వైసీపీ రాజకీయాలను శాసిస్తున్న రాజ్యసభ సభ్యుడు విజయ్ సాయి రెడ్డి, మరోవైపు సీఎం జగన్ అనకాపల్లిలో యువనేత గుడివాడ అమర్నాథ్‌కు ప్రయారిటీ ఇవ్వడంతో దాడి ఫ్యామిలీని ఏ మాత్రం పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఏదేమైనా దాడి అప్పుడు టిడిపిలో... ఇప్పుడు వైసీపీ లోనూ అధికారంలో ఉండి కూడా రెంటికీ చెడ్డ రేవడిగా మారారు.

మరింత సమాచారం తెలుసుకోండి: