తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఒక్కోసారి రాజకీయ పరిశీలకులకు కూడా అంతు చిక్కని విధంగా వ్యూహాలు రచిస్తుంటారు. తాజాగా హుజురాబాద్‌ ఉపఎన్నిక నేపథ్యంలో ఆయన మరోసారి వ్యూహాన్ని మార్చడం రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. తాజా సమాచారం ప్రకారం హుజురాబాద్‌ ఉపపోరులో అధికార టీఆర్ఎస్‌ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ అని తెలుస్తోంది. ఈయన అభ్యర్థితత్వం దాదాపు ఖరారు అయిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. తొలుత హుజురాబాద్‌ టీఆర్ఎస్‌ అభ్యర్థిగా కౌశిక్‌ రెడ్డిని అనుకున్నారు. అయితే ఆయన  స్థానంలో బీసీ వర్గానికి చెందిన విద్యార్థి నాయకుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ను హుజురాబాద్‌ బైపోల్‌ బరిలో నిలపాలని కేసీఆర్‌ నిర్ణయించారు. ఆయన అనూహ్యంగా వ్యూహం మార్చడం, అందులోని ఆంతర్యం ఏమిటి? అన్న దానిపై ఇప్పుడు రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

కాంగ్రెస్‌ పార్టీ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన కౌశిక్‌రెడ్డి.. నిజానికి హుజురాబాద్‌లో బలమైన నాయకుడు. అయితే తెలంగాణ ఉద్యమం సమయంలో వ్యతిరేకంగా వ్యవహరించారని కౌశిక్‌రెడ్డి ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇవి జనాల్లోకి బలంగా కూడా వెళ్లాయి. దీన్ని పసిగట్టిన కేసీఆర్‌.. తన రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించారు. కౌశిక్‌ రెడ్డిని టీఆర్ఎస్‌ తరఫున పోటీకి నిలిపితే పార్టీకి ఓటమి తప్పదని భావించే... ఆయనకు గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ ఇస్తామని ప్రకటించారట. కౌశిక్‌రెడ్డిని పోటీకి నిలిపితే ఆయన సామాజికవర్గం మద్దతు లభించడం కూడా కష్టం కావొచ్చునని నివేదిక అందిందట. కౌశిక్‌రెడ్డికి ఉద్యమ నేపథ్యం లేకపోవడం వల్ల తలెత్తే ప్రమాదాన్ని ముందే అంచనా వేసిన కేసీఆర్‌.. వెంటనే గేమ్‌ప్లాన్‌ ఛేంజ్‌ చేశారట. అందుకే కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆయన్ను మారు మాట్లాటకుండా చేశారని టాక్.

ఇక మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు ప్రత్యర్థిగా గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ సరైన అభ్యర్థి అని టీఆర్ఎస్‌ వర్గాలు కూడా భావిస్తున్నాయి. ఎందుకంటే.. తెలంగాణ ఉద్యమం సమయం నుంచి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ టీఆర్ఎస్‌లోనే ఉన్నారు. విద్యార్థి నాయకుడుగా కొనసాగుతున్నారు. బీసీ సామాజికవర్గానికి చెందిన ఆయన్ను టీఆర్ఎస్‌ తరఫున బరిలో నిలపడం బాగా కలిసి వచ్చే అంశమని టీఆర్ఎస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి హుజురాబాద్ ఉపఎన్నికలో కేసీఆర్‌ గేమ్‌ప్లాన్‌ ఛేంజ్‌ ఏ మేరకు సత్ఫలితాలు ఇస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: