గత కొన్నేళ్లుగా అప్పులతో నడుస్తున్న ఏపీ ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లుండి పిడుగు వేసింది. ముఖ్యంగా సంక్షేమ పథకాల అమలు కోసం కూడా రుణాలపైనే ఆధారడుతున్న వైసీపీ సర్కారుకి భారీ షాక్‌ ఇచ్చింది. వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసిన ఫిర్యాదుపై కేంద్రం స్పందించింది. జగన్‌ సర్కార్‌ వివరణ కోరింది. ఏపీఎస్‌డీసీ ద్వారా సేకరిస్తున్న రుణాలతో సంక్షేమ పథకాలను లాక్కొస్తున్న ప్రభుత్వానికి ఇది శరాఘాతంగా మారనుంది. వచ్చే 20 ఏళ్ల మద్యం ఆదాయాన్ని గ్యారంటీగా పెట్టి మరీ రుణాలు తీసుకుంటున్న ప్రభుత్వానికి ఇది రాజ్యాంగ విరుద్ధమని కేంద్ర ఆర్థిక శాఖ తేల్చిచెప్పింది.

ఇక ఏపీలో రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ పేరుతో గతేడాది ఓ సంస్ధను ఏర్పాటు చేసి దాని ద్వారా రుణాలు తీసుకుని నవరత్నాల్లోని సంక్షేమ పథకాలు నడిపిస్తున్న జగన్ సర్కార్‌కు కేంద్రం భారీ షాకిచ్చింది. ఏపీఎస్‌డీసీ పేరుతో రుణాలు తీసుకుంటూ వాటిని సంక్షేమ పథకాలకు వాడుకోవడం, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వ ఆస్తుల్ని, భవిష్యత్ ఆదాయాల్ని తాకట్టు పెట్టడాన్ని తప్పుపడుతూ కేంద్ర ఆర్ధిక శాఖలోని వ్యయ విభాగం పంపిన లేఖ ఇప్పుడు ప్రభుత్వంలో కలకలం రేపుతోంది. ఈ లేఖలో పేర్కొన్న అంశాలపై తీవ్ర చర్చ జరుగుతోంది.

ఇప్పటికే రాష్ట్ర అసెంబ్లీలో చట్ట సవరణ చేసి మరీ ఏపీఎస్‌డీసీ ద్వారా ఈ రుణాలు తీసుకుంటున్న ప్రభుత్వం కేంద్రం పంపిన లేఖతో ఇరుకునపడింది. రఘురామ ఫిర్యాదుతో ఏపీ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ పేరుతో ఓ సంస్ధను ఏర్పాటు చేసి దాని ద్వారా వైసీపీ ప్రభుత్వం భారీ ఎత్తున రుణాలు సేకరిస్తోందని, ఇందుకు ప్రభుత్వ ఆస్తుల్ని, భవిష్యత్ ఆదాయాన్ని తనఖా పెడుతుందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రధాని నరేంద్ర మోదీకి,  ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌కు వేర్వేరు లేఖలు రాసి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలోని కలెక్టరేట్‌లు, ఎమ్మార్వో ఆఫీసులు, ఇతర ప్రభుత్వ భవనాలను తాకట్టు పెట్టి ఏపీఎస్‌డీసీ ద్వారా రుణాలు తీసుకుంటున్నట్లు రఘురామరాజు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేంద్ర ఆర్థికశాఖలోని వ్యయ విభాగం స్పందించింది. ఏపీ ప్రభుత్వం ఎస్‌డీసీ ద్వారా చేస్తున్న అప్పులపై రఘురామరాజు రాసిన లేఖను పరిగణనలోకి తీసుకుంటూ జగన్‌ సర్కారుకి లేఖ రాసింది. రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ ద్వారా రుణ సేకరణ రాజ్యాంగ విరుద్ధంగా ఉందని ఏపీ ఆర్థికశాఖకు రాసిన లేఖలో పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: