ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య‌కేసు ద‌ర్యాప్తే రోజుకో మ‌లుపు తిరుగుతోంది. కేసు విచార‌ణ ఒక కొలిక్కా రాకుండానే ద‌ర్యాప్తే ఇన్ని మ‌లుపులు తిరుగుతుండ‌టంతో ప్ర‌జ‌లు కూడా ఆశ్చ‌ర్య‌పోతున్నారు. క‌డ‌ప‌, పులివెందుల‌లో మూడు బృందాలుగా ద‌ర్యాప్తు చేస్తోన్న సీబీఐ తాజాగా గోవాలో ప్ర‌ధాన నిందితుడిగా భావిస్తోన్న సునీల్‌యాద‌వ్‌ను అదుపులోకి తీసుకుంది. విచార‌ణ కూడా పూర్త‌యిన‌ట్లు తెలుస్తోంది.

అందుబాటులో లేకుండా పోయిన సునీల్‌యాద‌వ్‌
క‌డ‌ప‌, పులివెందుల‌లో జ‌రిపిన విచార‌ణ‌లో పాల్గొన్న సునీల్‌యాద‌వ్‌ను ఎప్పుడు విచార‌ణ‌కు పిలిస్తే అప్పుడు రావాల‌ని, అందుబాటులో ఉండాల‌ని సీబీఐ అధికారులు సూచించారు. అయితే ఆయ‌న త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి కొద్దిరోజులుగా క‌న‌ప‌డ‌టంలేద‌ని సీబీఐ స‌మాచారం అందుకుంది. ద‌ర్యాప్తు ప్రారంభించ‌గా సునీల్ గోవాలో ఉన్న‌ట్లు క‌నుగొన్నారు. అక్క‌డిక‌క్క‌డే అరెస్ట్‌చేసి కోర్టులో ప్ర‌వేశ‌పెట్టే అంశాన్ని ప‌రిశీలిస్తున్న‌ట్లు తెలియ‌వ‌స్తోంది. సీబీఐ నుంచి జాతీయ మీడియాకు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం వివేకా హ‌త్య‌కేసులో ప‌లు ఆధారాల‌ను అధికారులు సేక‌రించారు. వాటి ఆధారంగా సునీల్ ప్ర‌ధాన నిందితుడ‌నేది వారి భావ‌న‌గా ఉంది. 2019, మార్చి 15న వైఎస్ వివేకానంద రెడ్డి త‌న ఇంట్లోనే హ‌త్య‌కు గురైన విష‌యం తెలిసిందే. ఆ హ‌త్య జ‌రిగిన రెండు సంవ‌త్స‌రాల త‌ర్వాత ప్ర‌ధాన నిందితుడిని సీబీఐ తొలిసారిగా అదుపులోకి తీసుకోవ‌డం గ‌మ‌నార్హం.

57 రోజులుగా కొన‌సాగుతోన్న విచార‌ణ‌
క‌రోనా కార‌ణంగా కొద్దిరోజులు కేసు ద‌ర్యాప్తును వాయిదా వేసిన అధికారులు ఆ త‌ర్వాత పునఃప్రారంభించారు. క‌డ‌ప కేంద్ర కారాగారాన్ని కేంద్రంగా చేసుకొని 57 రోజులుగా విచార‌ణ జ‌రుగుతోంది. ప‌లువురు అనుమానితుల‌ను ప్ర‌శ్నించ‌డంతోపాటు మ‌రికొంద‌రిపై సునిశిత ప‌రిశీల‌న చేస్తున్నారు. వివేకా వాచ్‌మెన్ రంగ‌య్య‌ను ఇటీవ‌ల జ‌మ్మ‌ల‌మ‌డుగు కోర్టులో హాజ‌రుప‌రిచి వాంగ్మూలం ఇప్పించారు. ఎర్ర గంగిరెడ్డి, డ్రైవ‌ర్ ద‌స్త‌గిరి, సునీల్ పాత్ర ఉంద‌ని రంగ‌య్య త‌న వాంగ్మూలంలో పేర్కొన్న‌ట్లు తెలిసింది. సీబీఐ సునీల్‌తో పాటు ఆయన తమ్ముడు కిరణ్ యాదవ్‌, ఆయ‌న త‌ల్లిదండ్రుల‌ను కూడా విచారించింది. ఈ విచార‌ణ అనంత‌రం సునీల్ కుటుంబం పులివెందుల‌లోని త‌న నివాసానికి తాళంవేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయ‌న స‌మీప బంధువు ఇచ్చిన స‌మాచారంతో సునీల్ గోవాలో ఉన్న‌ట్లు తెలుసుకొని అరెస్ట్ చేశారు. అయితే ఈ విష‌యాన్ని పోలీసులుకానీ, సీబీఐ అధికారులుకానీ ధ్రువీక‌రించ‌డంలేదు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

tag