దాదాగిరి. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తున్న ప‌దం ఇది. ఎందుకంటే తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఏపీ ప్ర‌భుత్వం నీటి విష‌యంలో దాదాగిరి చేస్తోంద‌ని ఆరోపించారు. నాగార్జున‌సాగ‌ర్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లివ‌చ్చిన త‌ర్వాత న‌దీజ‌లాల విష‌యంలో ఏపీ తీరును ఆయ‌న త‌ప్పుప‌ట్టారు. ఎవ‌రు దాదాగిరి చేస్తున్నారంటూ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి కేసీఆర్‌కు కౌంట‌ర్ ఇచ్చారు. కేసీఆర్ దాదాగిరివ‌ల్లే 30 టీఎంసీల నీరు స‌ముద్రంలోకి పోయింద‌ని విమ‌ర్శించారు. అంత‌వ‌ర‌కు బాగానేఉంది.. బాగానే విమ‌ర్శించుకుంటున్నారుకానీ అదంతా బూట‌క‌మేనంటున్నారు ప్ర‌తిప‌క్ష నేత‌లు. హుజూరాబాద్ ఎన్నిక‌ను దృష్టిలో ఉంచుకొని ఆంధ్రా సెంటిమెంట్‌ను రెచ్చ‌గొట్టి ఉప ఎన్నిక‌ల్లో ల‌బ్ధి పొందాల‌నేది కేసీఆర్ యోచ‌న అని, అందుకు ఇక్క‌డి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స‌హ‌క‌రిస్తున్నారంటూ విమ‌ర్శలు వ‌స్తున్నాయి.

ప‌ర‌స్ప‌రం స‌హ‌క‌రించుకుంటున్న రెండు రాష్ట్రాలు
ఇటీవ‌ల ఆంధ్ర‌, తెలంగాణ ప్ర‌భుత్వాల మ‌ధ్య స్నేహ‌పూర్వ‌క ఒప్పందాలు కుదిరాయి. ఏపీ ప్ర‌భుత్వం పాఠ‌శాల‌ల్లో మౌలిక సౌక‌ర్యాలు మెరుగుప‌రిచేందుకు అభివృద్ధి చేసిన సాఫ్ట్‌వేర్ నాడు-నేడును ఉప‌యోగించుకోవాల‌ని తెలంగాణ భావించింది. కోర‌గా ఇవ్వ‌డానికి వెంట‌నే ఏపీ ప్ర‌భుత్వం అంగీక‌రించింది. ఎన్‌వోసీ ఇచ్చింది. అలాగే ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి త‌న ఓఎస్డీగా తెలంగాణ‌కు చెందిన ఒక జైళ్ల‌శాఖ అధికారిని తీసుకోవాల‌ని భావించారు. ఆమేర‌కు తెలంగాణ‌ ప్ర‌భుత్వానికి ద‌ర‌ఖాస్తు చేయ‌గా వెంట‌నే అంగీకారం ల‌భించింది. ఇలా ఇరు ప్ర‌భుత్వాలు ప‌ర‌స్ప‌రం ఒక‌రికి మ‌రొక‌రు చేదోడు వాదోడుగా ఉంటూ స్నేహ‌పూర్వ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న త‌రుణంలో కృష్ణా జ‌లాల‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తే న‌మ్మేవారు ఎవ‌రుంటార‌ని ప్ర‌తిప‌క్ష నేత‌లు విమ‌ర్శిస్తున్నారు.

స్వ‌యంగా విమ‌ర్శ‌లు చేస్తున్న కేసీఆర్‌
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ ఇలా రెండు రాష్ట్రాలు స‌హ‌క‌రించుకుంటుండ‌గా కేసీఆర్ స్వ‌యంగా ఏపీపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఆయ‌న విమ‌ర్శ‌కు ప్ర‌తి విమ‌ర్శ‌గా స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి రంగంలోకి దిగుతున్నారు. నీళ్ల రాజ‌కీయం చేస్తున్నార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఈ విమ‌ర్శ‌ల‌న్నీ పై పైనేన‌ని అంటున్నారు. కృష్ణాజ‌లాల‌కు సంబంధించిన న‌దీ బోర్డును కేంద్ర ప్ర‌భుత్వం త‌న అధీనంలోకి తీసుకున్న త‌ర్వాత కూడా ఇలా విమ‌ర్శ‌లు చేసుకోవ‌డ‌మ‌నేది ఒక రాజ‌కీయ డ్రామాగా అభివ‌ర్ణిస్తున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి:

tag