తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న అంశం నియోజకవర్గాల పెంపు. ఇప్పటికే నియోజవర్గాల పెంపు కోసం ఎంతో మంది రాజకీయ నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 294 నియోజకవర్గాలున్నాయి. 2014 లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ నియోజక వర్గాల సంఖ్య 175కు పడిపోయింది. తెలంగాణలో 119 నియోజకవర్గాలు ఉన్నాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 జిల్లాలను 33 జిల్లాలుగా విభజించింది కేసీఆర్ సర్కార్. పరిపాలన సౌలభ్యం కోసమే అని పైకి చెబుతున్నప్పటికీ... కొత్త నియోజకవర్గాల ఏర్పాటు కోసమనేది లోపల వినిపిస్తున్న మాట.

ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించింది. పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేస్తామంటూ పాదయాత్ర సమయంలో వైఎస్ జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ కోసం ఓ కమిటీ కూడా నియమించారు. అయితే... పార్లమెంట్ ప్రాతిపధికన పునర్ విభజన చేస్తే... చాలా నైసర్గికంగా చాలా ఇబ్బందులు వస్తాయని... అలాగే స్థానికంగా కూడా చాలా వ్యతిరేకత వస్తుందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఈ ఏడాది జనవరి 26 నాటికే ఓ క్లారిటీ వస్తుందని అంతా భావించినప్పటికీ.. ఎలాంటి పురోగతి కనిపించలేదు. అటు శ్రీకాకుళం మొదలు... ఇటు అనంతపురం వరకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రస్తుతానికి బ్రేక్ పడింది.

అటు తెలంగాణలో కొత్త నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలంటూ ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తున్నప్పటికీ... ఆంధ్రప్రదేశ్ సర్కార్ మాత్రం ఇప్పటికీ కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయలేదు. ఈ నేపథ్యంలో కొత్త నియోజకవర్గాల ఏర్పాటుపై లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి క్లారిటీ ఇచ్చారు. 2031 తర్వాత కొత్త నియోజకవర్గాల ఏర్పాటు ఉంటుందన్నారు రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 ప్రకారం 2026 తర్వాత ప్రచురించే జనాభా లెక్కల ప్రకారమే పునర్విభజన జరుగుతుందని ఫుల్ క్లారిటీగా చెప్పారు. ఈ లోపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేసే అవకాశం కూడా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: