ఆంధ్ర‌ప్ర‌దేశ్ హోంశాఖ మంత్రిగా మేక‌తోటి సుచ‌రిత వ్య‌వ‌హ‌రిస్తున్నారు. త‌మ ప్ర‌భుత్వంలో ఒక ద‌ళిత ఎమ్మెల్యేను, అందులోను ఒక మ‌హిళ‌ను హోంమంత్రిని చేశామ‌ని వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి స‌ర్కార్ ఘ‌నంగా ప్ర‌క‌టించుకుంది. అంత‌వ‌ర‌కు బాగానేవుంది కానీ.. వాస్త‌వ ప‌రిస్థితుల‌ను ప‌రిశీలిస్తే.. పేరుకే ఆమె మంత్రిగా ఉన్నారుకానీ ఆ శాఖ‌లోని పెత్త‌న‌మంతా ఒక సామాజిక‌వ‌ర్గానికి చెందిన అధికార ప్ర‌తినిధుల‌దే ఉంది. త‌మ శాఖ‌లో ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు.. ఇలా ఎవ‌రైనా స‌రే బ‌దిలీలు జ‌రుగుతున్నా కూడా త‌మ‌కు క‌నీసం స‌మాచారం కూడా ఇవ్వ‌డంలేదంటూ సుచ‌రిత మ‌ద్ద‌తుదారులు, అనుచ‌రులు వాపోతున్నారు. చివ‌ర‌కు ఆమె ప్రాతినిథ్యం వ‌హిస్తోన్న గుంటూరు జిల్లాలోని ప్ర‌త్తిపాడు నియోజ‌క‌వ‌ర్గంలో కూడా ఒక‌సామాజిక‌వ‌ర్గానికి చెందిన‌వారే అధికారం చెలాయిస్తున్నార‌ని, మంత్రి మాట‌ల‌ను ఖాత‌రు చేయ‌డంలేద‌ని వైసీపీ వ‌ర్గాలే అంటున్నాయి.

సుచ‌రిత‌కు వ్య‌తిరేకంగా డొక్కా పావులు
గ‌డిచిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సుచ‌రిత‌పై తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున పోటీచేసి ఓట‌మి పాలైన మాజీ మంత్రి డొక్కా మాణిక్య‌వ‌ర‌ప్ర‌సాద్ కూడా సుచ‌రిత‌కు ఇప్పుడు వ్య‌తిరేకంగా ప‌నిచేస్తున్నారు. ఈ సారి ఎన్నిక‌ల‌కు ఆయ‌న ప్ర‌త్తిపాడు నుంచి వైసీపీ టికెట్‌పై పోటీచేయాల‌నే యోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీగా ఉంటూ చివ‌రి నిముషంలో ఓటింగ్‌కు హాజ‌రు కాకుండా ఉండేందుకు డొక్కా వైసీపీవారికి అమ్ముడుపోయారంటూ తెలుగుదేశం పార్టీ నేత‌లు ఆరోపిస్తున్నారు. తెలుగుదేశంపార్టీకి, వైసీపీకి దూరంగా ఉంటున్నాన‌ని చెబుతున్న ఆయ‌న ప్ర‌త్తిపాడులో త‌న‌కంటూ ఒక‌వ‌ర్గాన్ని త‌యారుచేసుకునే ప‌నిలో ఉన్నారు.

హోంమంత్రిని గౌర‌వించిన సంద‌ర్భాలు అరుదు
వాస్త‌వంగా మాట్లాడాలంటే హోంమంత్రిగా సుచ‌రిత సాధించింది ఏమైనా ఉందా అంటే కేవ‌లం ఆమెకు ఎస్కార్ట్‌గా వెళ్లేట‌ప్పుడు, వ‌చ్చేట‌ప్పుడు వాహ‌నాలు ఉండ‌టం, ఇంటిద‌గ్గ‌ర పోలీస్ ఎస్కార్ట్ ఉండ‌టం.. అంత‌కుమించి ఏమీలేదు. త‌మ ప్ర‌భుత్వంలో ఒక ద‌ళిత మ‌హిళ‌కు హోంమంత్రి ప‌ద‌వి ఇచ్చామ‌ని చెబుతున్న స‌ర్కార్ అందుకు త‌గిన‌ట్లుగా ఆమ‌ను గౌర‌వించిన సంద‌ర్భాలైతే అరుదు. ఒక‌ర‌కంగా లేవ‌ని చెప్ప‌వ‌చ్చు. ఉమ్మ‌డి రాష్ట్రంలో స‌బితా ఇంద్రారెడ్డి త‌ర్వాత ఏపీలో సుచ‌రిత‌కు ఇచ్చామ‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. స‌బితా ఇంద్రారెడ్డి ప‌ద‌విలో ఉన్న‌ప్పుడు దివంగ‌త వైఎస్ ఆమెను ఎంతో ప్రోత్స‌హించారు. దీనికితోడు సామాజిక‌వ‌ర్గం కూడా క‌లిసిరావ‌డంతో ఆమె చెప్పింది చెల్లుబాటు అయింది. ఇక్క‌డ సుచ‌రిత హోంమంత్రి అయినా ఆమెకు క‌లిసిరానిది సామాజిక‌వ‌ర్గ‌మేన‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. ప్ర‌త్తిపాడుకే ఒక‌ర‌కంగా ప‌రిమిత‌మ‌య్యార‌ని చెప్ప‌వ‌చ్చంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

tag