ఢిల్లీలో రెండో రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల నిరసన కొన‌సాగుతోంది. కాగా ఏపీ భవన్ వద్ద జ‌రిగిన ధర్నాలో ఎంపీ విజయసాయి రెడ్డి పాల్గొన్నారు. అంతే కాకుండా స్టీల్ ప్లాంట్ కార్మికులకు వైసీపీ ఎంపీలు మ‌ద్ద‌తు తెలిపారు. ఈ సందర్భంగా  వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకులు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ... ఉక్కు పరిశ్ర‌మ‌ కార్మికులకు భరోసా ఇచ్చారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు కార్మిక సంఘాలు తలపెట్టిన ఈ ఉద్యమాన్ని ఒక ఏడాది పాటు ఇదేలా కొనసాగిస్తే సార్వత్రిక ఎన్నికలకు గడువు దగ్గర పడుతుందని వ్యాఖ్యానించారు. ఎన్నికలను ముందు పెట్టుకుని ఏ ప్రభుత్వం కూడా ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకోదని విజయసాయి రెడ్డి అన్నారు. 

ఒక సంవత్సరం పాటు దీన్ని కొనసాగించాలంటే మనం అందరం కలిసి సంఘటితంగా పోరాటం చేయాలని విజ‌య సాయి పిలుపునిచ్చారు. అవసరమైతే మీరు కోర్టులను ఆశ్రయించి ఈ ప్రక్రియపై  స్టే తీసుకురావడానికి ప్రయత్నించండని స‌ల‌హా ఇచ్చారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వం నిర్ణయంలోనే అనేక అవకతవకలు ఉన్నాయంటూ ఆరోపించారు. అవన్నీ ప్రభుత్వంలోని పెద్దలకు తెలుసని విజ‌య సాయి రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. కాబట్టి న్యాయస్థానాల్ని ఆశ్రయించి ఈ ప్రైవేటీకరణ ప్రక్రియను నిలిపివేయడానికి ప్రయత్నాలు చేయాల‌ని  అన్నారు. ఉక్కు కార్మికుల పోరాటంలో త‌మ‌ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని విజ‌య సాయి రెడ్డి స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్ మోహన్ రెడ్డి విశాఖ ఉక్కు కార్మికులు, ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడాలని ఎల్లవేళలా కోరుకుంటున్నారని విజ‌య‌సాయి తెలిపారు. ఉక్కు కార్మికుల పోరాటానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సహాయ, సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. మీ వెంట ఉండి మేం నడుస్తాం. మా ఎంపీలు అంతా నిన్న, ఈరోజు ఈ ధర్నాలో పాల్గొనటం జరిగిందంటూ విజ‌య‌సాయి రెడ్డి వ్యాఖ్యానించారు. మీ వెంట నిలబడి మీతో కలిసి పోరాడుతామని ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నా అంటూ కార్మికుల‌కు విజ‌య సాయి బ‌రోసా ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: