ఏదైనా తెగేదాకా లాగితే అంతే. ఇపుడు అనంతపురం జిలాలో జేసీ ప్రభాకరరెడ్డి సీన్ కూడా అంతే అంటున్నారు. నాడు జగన్ తమ పార్టీ వారికి ఫిరాయింపులు వద్దు అని చెప్పడం వల్లనే జేసీ ప్రభాకరరెడ్డి బతికిపోయారు. తాడిపత్రి చైర్మన్ అయిపోయారు. అయితే ఆ తరువాత అదే సీఎం పోస్టులా భావించి జేసీ చాలా అతి చేస్తున్నారు. ఆయన దూకుడు ఎంతదాకా వెళ్ళింది అంటే ఏకంగా తమను ఓడించిన తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డిని ధిక్కరించేటంతలా. అంతే కాదు, జిల్లాలోని మంత్రులను అసలు ఖాతరు చేయడంలేదు. జగన్ సర్కార్ని కూడా ఎక్కడా విడిచిపెట్టడంలేదు.

దాంతో ఇపుడు వైసీపీ కనుక తన పొలిటికల్  స్టాండ్ మార్చుకుంటే ఈ జేసీ మాజీ అవుతారు అన్న మాట గట్టిగా వినిపిస్తోంది. నిజానికి ఉప్పూ నిప్పులా ఉన్న‌ చోట తాడిపత్రికి గుండె కాయ లాంటి మునిసిపల్ చైర్మన్ గిరీని జేసీ ఫ్యామిలీకి ఇవ్వడమే జగన్ చేసిన పెద్ద తప్పు అని కూడా వైసీపీ నాయకులు అంటున్నారు. ఆరు నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో టీడీపీకి, వైసీపీకి సమానంగా పద్దెనిమిది సీట్లు వచ్చాయి. అయితే అధికారంలో వైసీపీ ఉంది. తలచుకుంటే టీడీపీ నుంచి కొంతమంది కౌన్సిలర్లను వైసీపీ వైపుగా లాగేస్తే జేసీ జస్ట్ కౌన్సిలర్ గా మాత్రమే ఉండేవారు.

కానీ జగన్ మాత్రం ఫిరాయింపులు వద్దు అంటూ తమ పార్టీ వారికి సూచించడం వల్ల జేసీ చైర్మన్ అయ్యారు. దానికి గాను ఆయన జగన్ కి ధన్యవాదాలు కూడా చెప్పారు. తాను చైర్మన్ అయ్యాను అంటే అది జగన్ దయ మాత్రమే అని కూడా మీడియా ముందే చెప్పుకున్నారు. అయితే ఈ ఆరు నెలల వ్యవధిలో ప్రభాకరరెడ్డిలో మార్పు కనిపిస్తోంది. ఆయన పొలిటికల్ గా ముందుకు వెళ్తున్నారు. మళ్ళీ తాడిపత్రి కోటను కొట్టాలని చూస్తున్నారు. మరి ఆయనకు ఆ అవకాశం ఇచ్చి వైసీపీ తప్పు చేసింది అన్న మాట అయితే పార్టీ నేతల్లో ఉంది.

ఇక మునిసిపల్ ఉద్యోగుల విషయం తీసుకుంటే వారు ఎమ్మెల్యే పెద్దారెడ్డి మాట వినలేక చైర్మన్ గా ఉన్న జేసీ దూకుడుతో పడలేక నలిగిపోతున్నారు. పెద్దారెడ్డి ఎమ్మెల్యే,  పైగా అధికార పార్టీ, ఎక్కడా తగ్గరు. దాంతో ఇది మరింత పెరిగి పెద్ద అవుతుంది. అందుకే జేసీని మాజీని చేస్తేనే తప్ప ఈ భీకర రాజకీయ పోరుకు ఫుల్ స్టాప్ పడదు అంటున్నారు. జగన్ సై అంటే జేసీ ఇంటికే అంటున్నారుట.

మరింత సమాచారం తెలుసుకోండి: