ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న అప్పుల అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. ఎవరూ ఊహించని విధంగా మద్యం మీద వచ్చే ఆదాయాన్ని కూడా తనఖా పెట్టి అప్పులు తెచ్చిన వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ను ఒక రకంగా బూచిగా చూసే పరిస్థితి కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం సంక్షోభ పరిస్థితుల్లో ఉన్నామని అందుకే అప్పులు చేస్తున్నామని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన సహా అధికారంలో ఉన్న పార్టీ పెద్దలు అందరూ ఒకటే మాట వేదంలా వల్లిస్తున్నారు. అయితే గత టీడీపీ ప్రభుత్వం ఇప్పటి వైసీపీ ప్రభుత్వం మధ్య అప్పుల తేడా ఎలా ఉంది అనేది పరిశీలిస్తే చాలా స్పష్టమైన తేడా కనిపిస్తోంది.. 

 

 

ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కర పత్రికగా భావించే సాక్షి దినపత్రికలో తెలుగుదేశం పార్టీ హయాంలో 60 నెలలకు గాను లక్షా 40 వేల కోట్లు అప్పు చేసినట్లు చూపించారు.. అంటే నెలవారీగా చూసుకుంటే 2333 కోట్ల రూపాయలు అప్పు చేసినట్లు అయింది. కానీ వైసిపి ప్రభుత్వం వచ్చిన 22 నెలలకే వారు 88 వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. నెలవారీగా తీసుకుంటే ఇది నాలుగు వేల కోట్లకు పైమాటే.. అయితే వాస్తవ సంఖ్యలు మరికాస్త ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ లెక్కల్లో మద్యం ఆదాయాన్ని తనఖా పెట్టి తీసుకువచ్చిన పాతిక వేల కోట్లు, అలాగే మార్చి తర్వాత బ్యాంకుల నుంచి తీసుకు వచ్చిన అప్పులు ఇందులో కలపలేదు. కేవలం ఏప్రిల్ నెలలోనే పంతొమ్మిది వేల కోట్లు అప్పు చేయగా మే నెలలో దానికి సంబంధించిన ఎలాంటి క్లారిటీ లేదు.

 

 అనూహ్యంగా జూన్ నెలలో ఆర్బీఐ 3750 కోట్ల రూపాయలను ఓవర్డ్రాఫ్ట్ అమౌంట్ కింద కట్ చేసుకుంది. అంటే దాదాపుగా ఇరవై నాలుగు నెలలు వైసీపీ ప్రభుత్వం దాదాపు లక్షా ఇరవై వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది. అంటే సుమారు ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఐదేళ్ల అప్పు కు దాదాపు సమానంగా కనిపిస్తోంది.. కానీ ఈ రోజు మీడియా ముందుకు వచ్చిన ప్రభుత్వ సలహాదారు, పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు అడ్డంగా దోచుకోవడం వల్లే ప్రస్తుతం రాష్ట్రానికి ఈ పరిస్థితి నెలకొందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఉందని చెబుతూనే బాబు చేసిన భారీ అప్పులు వల్లే రాష్ట్రం మీద ఆర్థిక భారం పడిందని చంద్రబాబు అప్పులకు తోడు కరోనా పరిస్థితులు కూడా తోడయ్యాయి అని అంటున్నారు. అంటే చంద్రబాబు చేసిన అప్పు ల కారణంగానే ఇప్పుడు అప్పులు ఎక్కువగా చేస్తున్నామని ఆయన వాదన.. కానీ దానికి దీనికి ఏమి పొంతన ఉంది అనే దాని మీద మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. దానికి తగ్గట్టు సాక్షి చెబుతున్న వాస్తవ లెక్కలు కూడా దాచి మసి పూసి మారేడుకాయను చేసే పరిస్థితి కనిపిస్తోంది. 

 

పేదలకు సంక్షేమ పథకాలు ఇవ్వద్దని చెబుతారా అని ప్రశ్నిస్తున్న ఆయన ఆ సంక్షేమ పథకాలు అవసరమైనవా కాదా అనేది కూడా గమనించాలి అని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే చంద్రబాబు దిగిపోయిన తరువాత దాదాపు రెండేళ్ల పాలన జగన్ ప్రభుత్వం చేస్తూ వచ్చింది.. అంటే ఈ రెండేళ్లలో ఆదాయాన్ని పెంచే మార్గం ఏమీ జగన్ ప్రభుత్వం చేపట్ట లేదా అనే ప్రశ్న వినిపిస్తోంది.. మద్యం మీద ఆదాయమే పెంచుకోవడం మినహా వేరే ఏ విధంగానూ ఆదాయ మార్గాల మీద దృష్టి పెట్టకపోవడం వలన ఈ పరిస్థితి దాపురించిందని అంటున్నారు. కొత్తగా పెట్టుబడులు తీసుకురావడం కాదు కదా ఇప్పటికే ఉన్న పెట్టుబడులను వెనక్కి వెళ్లేలా ప్రభుత్వ విధానాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇవన్నీ పట్టించుకోకుండా చంద్రబాబే ఈ పరిస్థితికి కారణం అనేది కరెక్ట్ కాదనేది విశ్లేషకుల వారి వాదన. ఎందుకంటే రాష్ట్రం విడిపోయినప్పుడు ఎలాంటి సంపాదన లేకుండా మొదలుపెట్టి ఇతర రాష్ట్రాలకు దీటుగా పరుగులు పెట్టించారు చంద్రబాబు. కానీ ఇప్పటి పరిస్థితి చూస్తే రాబోయే రోజుల్లో ఈ లెక్కన ఇంకా 2. 5 లక్షల కోట్ల అప్పులు చేసే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: