విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ అయిదు దశాబ్దాల క్రితం పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. ఉక్కు మహిళ అన్న పేరున్న ఇందిరా గాంధీ నాటి ప్రధాని. ఆమె ఈ ఉద్యమాన్ని చూసి స్పందించి విశాఖకు ఉక్కు కర్మాగారాన్ని మంజూరు చేశారు.

విశాఖ ఉక్కు కర్మాగారం నిర్మాణ పనులు మొదలుపెట్టింది కూడా ఇందిరా గాంధీ టైమ్ లోనే. 1980లలో ఊపిరి పోసుకున్న ఉక్కు నిర్మాణం 1990 నాటికి పూర్తి అయింది. ఇక ఉక్కు ఉత్పత్తి కూడా అపుడే స్టార్ట్ అయింది. విశాఖ ఉక్కుని 1991 లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన పీవీ నరసింహారావు జాతికి అంకితం చేశారు. ఇక విశాఖ ఉక్కును ఆర్ధికంగా నిలబెట్టే ప్రయత్నం మరో కాంగ్రెస్ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో జరిగింది. మొత్తానికి కాంగ్రెస్ పాలనలోనే విశాఖ ఉక్కు అన్ని దశలనూ దాటుకుని ముందుకు వస్తే బీజేపీ నాయకులు దాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు అన్న విమర్శలు ఉన్నాయి.

విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేస్తే కచ్చితంగా దాని ప్రభావం ఏపీ రాజకీయాల మీద పడుతుంది అంటున్నారు. బీజేపీకి ఏపీలో పెద్దగా బలం లేదు. దాంతో బీజేపీకి పెద్ద చిక్కులు లేవు. కానీ అధికారంలో ఉన్న వైసీపీ మీద మాత్రం ఇది నెగిటివ్ ప్రభావం చూపిస్తుంది అంటున్నారు. విశాఖ సహా ఉత్తరాంధ్రా జిల్లాలలో వైసీపీ 2019 ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించింది.  ఈసారి మాత్రం ఉక్కు సెగ తగిలితే కచ్చితంగా వైసీపీ దెబ్బ తినడం ఖాయమనే అంటున్నారు. ఆ మధ్య జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీ సీట్లు తగ్గిపోవడానికి ఉక్కు సెగ కారణం అంటున్నారు. అది జస్ట్ శాంపిల్ మాత్రమేనని, అసలు కధ ముందు ఉందని అంటున్నారు.

దాంతో వైసీపీ ఉక్కు ఉద్యమంలో గట్టిగానే పాల్గొంటోంది. అయితే ఇది చాలదు అంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ స్వయంగా రంగంలోకి దిగాలని కూడా కోరుతున్నారు. ఆయన నాయకత్వం వహించి కేంద్రానికి ఉక్కు కర్మాగారం ఆవశ్యకతను తెలియచేయాలని కూడా కోరుతున్నారు. ఈ సందర్భంగా టీడీపీ ఎంపీ రామ్మోహననాయుడు అన్న మాటలను జాగ్రత్తగా  చూడాలి. పశ్చిమ బెంగాల్ లో ఉక్కు పరిశ్రమను ఎవరైనా ప్రైవేట్ పరం చేయగలరా అంటూ ఆయన ప్రశ్నించారు. అక్కడ మమతా బెనర్జీ ఉందని. ఆమె మోడీతో ఢీ కొట్టగరలన్నదే తమ్ముళ్ళ భావన. అలా ఏపీ సీఎం జగన్  కనుక చేస్తే కచ్చితంగా విశాఖ ఉక్కు నిలబడుతుంది అని అంటున్నారు. మరి రానున్న రోజుల్లో వైసీపీ గట్టిగా పోరాడకపోతే మాత్రం కచ్చితంగా చేదు ఫలితాలు చవిచూస్తారని అంటున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: