ఏపీలో ఎన్నికలు ఏవైనా గానీ ఫలితాలు మాత్రం వైసీపీకే అనుకూలంగా వస్తున్న విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఏ ఎన్నికలు జరిగిన వైసీపీ సత్తా చాటుతూనే ఉంది. పంచాయితీ ఎన్నికల్లో దుమ్ముదులిపిన వైసీపీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేసేసింది. అటు తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికలో కూడా భారీ మెజారిటీతో గెలిచింది.

ఇక పరిషత్ ఎన్నికలు జరిగాయి గానీ, ఫలితాలు ఇంకా రాలేదు. ఆ ఫలితాలు కూడా వైసీపీకి ఏకపక్షంగా ఉండనున్నాయని తెలుస్తోంది. ఇలా ప్రతి ఎన్నికల్లోనూ వైసీపీ సత్తా చాటింది. అలాగే త్వరలో జరగబోయే బద్వేలు ఉపఎన్నికలో కూడా వైసీపీకి తిరుగుండదని సంగతి తెలిసిందే. ఇక దీంతో పాటు రెండు కార్పొరేషన్లు, 11 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతుంది.

గతంలో మున్సిపాలిటీ ఎన్నికలకు ఇచ్చిన నోటిఫికేషన్‌లో శ్రీకాకుళం, నెల్లూరు కార్పొరేషన్‌లతో పాటు పలు మున్సిపాలిటీలకు ఎన్నికలు వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ రెండు కార్పొరేషన్లు, 11 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం రెడీ అయినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు జరిగిన ఎన్నికలని బట్టి చూస్తే, వీటిల్లో కూడా వైసీపీ వన్‌సైడ్ విక్టరీని సాధిస్తుందని చెప్పాల్సిన పని లేదు.

కాకపోతే శ్రీకాకుళం కార్పొరేషన్ పరిధిలో గెలుపు కోసం వైసీపీ కాస్త కష్టపడాల్సిన పరిస్తితి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో పరిస్తితి ఎలా ఉన్నా సరే శ్రీకాకుళం జిల్లాలో మాత్రం టీడీపీ నేతలు స్ట్రాంగ్‌గా ఉన్నట్లు కనిపిస్తున్నారు. పైగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడులు శ్రీకాకుళం కార్పొరేషన్‌లో పార్టీని గెలిపించడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం ఎంపీగా ఉన్న రామ్మోహన్, కార్పొరేషన్‌లో టీడీపీ గెలుపుని తన భుజాలపై వేసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీకాకుళంలో కింజరాపు ఫ్యామిలీకి ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది కాబట్టి, వైసీపీ కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది. లేదంటే శ్రీకాకుళం కార్పొరేషన్ చేజారిన ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: