ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, నిత్యం జగన్ ప్రభుత్వంపై ఏదొక అంశంపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే టీడీపీ నేతలు చేసే విమర్శలకు వైసీపీ నుంచి కూడా గట్టిగానే కౌంటర్లు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి..ప్రతిరోజూ టీడీపీకి కౌంటర్లు ఇవ్వడంలో ముందున్నారు. ఈయన ప్రతిరోజూ మీడియా ముందుకొచ్చి టీడీపీపై ఫైర్ అవుతున్నారు.

తాజాగా పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపుపై టీడీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై సజ్జల స్పందిస్తూ, గతంలో చంద్రబాబు ప్రభుత్వం వల్లే ఇప్పుడు పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయని ఫైర్ అయ్యారు. గతంలో రూ. 4 వ్యాట్ పెంచారని, అలాగే ఆర్టీసీ చార్జీలని పెంచారని, కానీ జగన్ మాత్రం ప్రజలపై ఎలాంటి భారం పడకుండా పాలన చేస్తున్నారని చెబుతున్నారు.

అయితే సజ్జల వ్యాఖ్యలకు టీడీపీ నేతల నుంచి కూడా కౌంటర్లు వస్తున్నాయి. మొదట్లో వ్యాట్ పెంచిన, ఆ తర్వాత తమ ప్రభుత్వం తగ్గించిందని, అలాగే అప్పుడు పెట్రోల్, డీజిల్ రేట్లు ఎంత ఉన్నాయో, ఇప్పుడు ఎంత ఉన్నాయో సరిగ్గా చూసుకోవాలని సూచిస్తున్నారు. అసలు ఆర్టీసీ చార్జీలని చంద్రబాబు హయాంలో పెంచలేదని, కాబట్టి సజ్జల వ్యాఖ్యల్లో వాస్తవం లేదని అంటున్నారు. ఇక ప్రజలపై జగన్ భారం పడకుండా పాలన చేస్తున్నారో లేదో, అదే ప్రజల్లోకి వెళ్ళి అడిగితే బాగుంటుందని చెబుతున్నారు.


పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్ రేటు రూ. 105 ఉంటే, ఏపీలో రూ. 110 ఎందుకు ఉందని ప్రశ్నిస్తున్నారు. ఇక ఆర్టీసీ ఛార్జీలు, కరెంట్ ఛార్జీలు, ఆస్తి పన్ను, చెత్త పన్ను...అబ్బో ఇలా ఒకటి ఏంటి అనేక రకాలుగా జగన్ ప్రభుత్వం, ప్రజలపై భారం మోపిందని, ఇది తాము అంటున్నది కాదని, ప్రజల నుంచి వస్తున్న మాటలనే చెబుతున్నామని అంటున్నారు. కాబట్టి సజ్జల చెప్పే కథలు ప్రజలకు బాగా తెలుసని, ఇంకా ఏది చెప్పిన ప్రజలు నమ్మే పరిస్తితుల్లో లేరని మాట్లాడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: