పరిస్థితులు ఎలా ఉన్నా సరే టీఆర్ఎస్‌ని ఓడించడమే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లక్ష్యమని గట్టిగా చెప్పొచ్చు. పీసీసీగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి వేరే పని లేకుండా, కేవలం కేసీఆర్‌ని గద్దె దించడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. వరుసపెట్టి కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ, ఎక్కడకక్కడ టీఆర్ఎస్‌ని దెబ్బకొట్టడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు.

ఈ క్రమంలోనే హుజూరాబాద్ ఉపఎన్నిక విషయంలో రేవంత్ వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది. అక్కడ రాజకీయంగా పరిస్తితి ఎలా ఉన్నా సరే టీఆర్ఎస్ ఓడిపోవడం రేవంత్ చూడాలని అనుకుంటున్నారు. మరి టీఆర్ఎస్‌ని కాంగ్రెస్ ఓడించే పరిస్తితి ఉందా? అంటే అసలు లేదనే చెప్పొచ్చు. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మాదిరిగా ఫైట్ జరుగుతుంది...ఇంకాస్త గట్టిగా చెప్పాలంటే టీఆర్ఎస్ వర్సెస్ ఈటల రాజేందర్ అన్నట్లుగా వార్ జరుగుతుంది.

ఇక ఇక్కడ కాంగ్రెస్ మూడో స్థానానికే పరిమితం అవుతుందని విశ్లేషణలు వస్తున్నాయి. అందుకే రేవంత్ కూడా హుజూరాబాద్‌పై పెద్దగా ఫోకస్ చేసినట్లు కనిపించడం లేదు. ఏదో మొక్కుబడిగా ఇన్‌చార్జ్‌లని పెట్టారు గానీ, ఇక్కడ దూకుడుగా ఉండాలని రేవంత్ అనుకోవడం లేదని తెలుస్తోంది. ఎందుకంటే హుజూరాబాద్‌లో కాంగ్రెస్ దూకుడుగా ఉంటే, ఎన్నికలో ఓట్లు ఎక్కువగా చీలిపోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది. అలాగే బలమైన అభ్యర్ధిని పెడితే ఓటమి పాలైన, కాస్త ఎక్కువ ఓట్లు వస్తే అది పరోక్షంగా టీఆర్ఎస్‌కు లబ్ది చేసినట్లు అవుతుందని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇక్కడ టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా పడే ప్రతి ఓటు ముఖ్యమని, ఆ వ్యతిరేక ఓట్లు బీజేపీ, కాంగ్రెస్‌లు చీల్చుకుంటే, ఆటోమేటిక్‌గా టీఆర్ఎస్‌కే ప్లస్ అవుతుంది. అందుకే రేవంత్ హుజూరాబాద్ విషయంలో పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఇక్కడ టీఆర్ఎస్ ఓడిపోవాలంటే, కాంగ్రెస్ కూడా మరీ ఘోరంగా ఓడిపోవాలి. అంటే కాంగ్రెస్ ఎంత తక్కువ ఓట్లు తెచ్చుకుంటే అంత ఎక్కువగా టీఆర్ఎస్‌కు నష్టం జరుగుతుంది. ఇప్పుడు రేవంత్ అదే వ్యూహంతో ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: