తీన్మార్ మల్లన్న గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. సోషల్ మీడియాలో తీన్మార్ మల్లన్న చాలా ఫేమస్. వీ6 ద్వారా మల్లన్న గెటప్‌తో పరిచయమైన నవీన్.. తీన్మార్ వార్తలు చదువుతూ.. తీన్మార్ మల్లన్నగా స్థిరపడిపోయాడు. ఆ తర్వాత ఉద్యోగం నుంచి బయటకు వచ్చి రాజకీయాల్లో దిగాడు. మొదట కాంగ్రెస్‌లో చేరినా గుంపులో గోవిందయ్యగా ఉండటం ఎందుకని సొంతంగానే రాజకీయాలు సాగిస్తున్నాడు. 



తనకు మొదటి నుంచి గుర్తింపు ఇచ్చిన తీన్మార్ మల్లన్న తరహాలోనే Qన్యూస్ అనే యూట్యూబ్‌ ఛానల్ నడుపుతూ తక్కువ కాలంలోనే ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత వరంగల్-ఖమ్మం- నల్గొండ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసి ఏకంగా టీఆర్ఎస్ అభ్యర్థికి చుక్కలు చూపించి గెలిచినంత పని చేశాడు. ఆ విజయం కాని విజయంతో ఆత్మవిశ్వాసం పుంజుకున్న మల్లన్న ఇప్పుడు తన యూట్యూబ్ చానల్ ద్వారా ప్రజలకు మరింతగా దగ్గరవుతున్నాడు. 



అయితే.. తీన్మార్ మల్లన్న యూట్యూబ్‌ ఛానల్‌లో పని చేస్తున్న చిలుక ప్రవీణ్‌ అనే ఓ రిపోర్టర్ ఇటీవల ఓ మహిళ నుంచి ఓ పని చేసిపెడతానని 40 వేల వరకూ నొక్కేశాడట. ఆ విషయంలో తనకు చెడ్డపేరు వస్తుందని మల్లన్న సదరు చిలుక ప్రవీణ్‌ను Q న్యూస్ నుంచి బయటకు పంపాడు.  ఆ విషయాన్ని ఇవాళ తన ఛానల్‌లో ప్రస్తావించిన మల్లన్న.. ఇలాంటి ప్రయోగాలు తనపై చేసి విజయం సాధించలేరని.. 300 కేసులు పెట్టుకున్నా మల్లన్న వెంట్రుక కూడా పీకలేరని సవాల్ విసిరాడు. 



విచిత్రం ఏంటంటే.. అలా సవాల్ విసిరిన కొన్ని గంటల్లోనే తీన్మార్ మల్లన్న Q న్యూస్ కార్యాలయంలో  పోలీసుల సోదాలు ప్రారంభమయ్యాయి. ఒక యువతి పిర్యాదు మేరకు  హైద్రాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల సోదాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ముందుగా ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే యూనిట్ ఆఫీస్ లో చొరబడ్డారని మల్లన్న వర్గాలు చెబుతున్నాయి. లోకల్ పోలీసులతో పాటు మూడు ప్రత్యేక వాహనాల్లో క్యూ న్యూస్ ఆఫీస్ వద్దకు చేరుకున్న పోలీసులు సోదాలు చేశారు. మరి ఈ సోదాలు దేనికి దారి తీస్తాయో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: