అనంతపురం జిల్లాలో టి‌డి‌పి నేతల మధ్య లుకలుకలు తారస్థాయికి చేరుకున్నట్లు కనిపిస్తున్నాయి. జిల్లాలో టి‌డి‌పి నాయకత్వం అంతా ఒక్కటి అయిపోయి, జే‌సి కుటుంబాన్ని సైడ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. దశాబ్దాల పాటు కాంగ్రెస్‌లో పనిచేసిన జే‌సి కుటుంబం...జిల్లాలో టి‌డి‌పికి ప్రధాన శత్రువులుగా ఉండేవారు. కానీ రాష్ట్ర విభజన నేపథ్యంలో జే‌సి ఫ్యామిలీ 2014 ఎన్నికల ముందు టి‌డి‌పిలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో జే‌సి దివాకర్ అనంతపురం ఎంపీగా పోటీ చేసి గెలవగా, తాడిపత్రి నుంచి జే‌సి ప్రభాకర్ పోటీ చేసి గెలిచారు.

2019 ఎన్నికల్లో జే‌సి బ్రదర్స్ ...వారి వారసులని రంగంలోకి దింపింది. కానీ జగన్ వేవ్‌లో వారు ఓటమి పాలయ్యారు. ఓడిపోయినా సరే జే‌సి ఫ్యామిలీ పార్టీలో యాక్టివ్‌గానే ఉంటున్నారు. అలాగే తాడిపత్రి మున్సిపాలిటీని టి‌డి‌పి ఖాతాలో పడేలా చేశారు. ఇలా పార్టీలో దూకుడుగా ఉంటున్న జే‌సి ఫ్యామిలీ...ఇప్పుడు కొత్త చిక్కుల్లో చిక్కుకుంది. మామూలుగానే ఏ విషయాన్నైనా జే‌సి బ్రదర్స్ మొహమాటం లేకుండా చెప్పేస్తారు.


ఇటీవల జే‌సి ప్రభాకర్ రెడ్డి అదే తరహాలో...సొంత పార్టీ నేతలపై విమర్శలు చేశారు. నాయకులు ఎవరూ కార్యకర్తలని పట్టించుకోవడం లేదని, ఇద్దరు నాయకుల వల్ల అనంతపురంలో టి‌డి‌పి నాశనమైపోతుందని మాట్లాడారు. ఇలా జే‌సి మాట్లాడినా వెంటనే జిల్లా టి‌డి‌పి నేతలంతా జే‌సిపై మాటల దాడి చేశారు. వరుసపెట్టి విమర్శలు చేశారు. ప్రతి ఒక్కరూ జే‌సి ప్రభాకర్‌పై ఫైర్ అయ్యారు. ఇలా జే‌సిని టార్గెట్ చేసిన టి‌డి‌పి నేతలు తాజాగా మరో షాక్ ఇచ్చారు.

తాజాగా అనంతపురం పార్లమెంటరీ కమిటీని జిల్లా టి‌డి‌పి నాయకత్వం నియమించింది. ఈ క్రమంలోనే 40 మందితో ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీలో జే‌సి వర్గానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. కానీ తాడిపత్రిలో మొదట నుంచి ఉన్న ఐదుగురు టి‌డి‌పి నేతలకు ప్రాధాన్యత ఇచ్చారు. దీని బట్టి చూస్తే జే‌సి ఫ్యామిలీకి టి‌డి‌పి నాయకత్వం పొమ్మనలేక పొగబెడుతున్నట్లు కనిపిస్తోంది. మరి జే‌సి ఫ్యామిలీ కూడా టి‌డి‌పిని వీడటానికి రెడీ అయిపోతారేమో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp