ఆంధ్రప్రదేశ్‌లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల కౌంటింగ్‌కు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సింగిల్‌ జడ్జి వెలువరించిన తీర్పును తోసిపుచ్చింది. ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించవచ్చని స్పష్టం చేసింది. అయితే హైకోర్టులో ఎన్నికల సంఘం తరపు న్యాయవాదులు చేసిన కీలకమైన వాదనలతోనే.. రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల కౌంటింగ్‌కు హైకోర్టు లైన్‌ క్లియర్‌ చేసిందా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది.

రాష్ట్రంలో ఈ ఏడాది ఏప్రిల్ 8వ తేదీన 515 జడ్పీటీసీలు, 7,220 ఎంపీటీసీలకు పోలింగ్ జరిగింది. అప్పట్లో హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఎన్నికల కమిషన్ పోలింగ్ నిర్వహించింది. కౌంటింగ్‌ను నిలిపివేసింది. అయితే గత ఏడాది కరోనా కారణంగా వాయిదా పడిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు.. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీన పదవీ బాధ్యతలు స్వీకరించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని నోటిఫికేషన్ వెలువరించారు. కేవలం వారం రోజుల సమయంలో ..ఏప్రిలో ఎనిమిదో తేదీన పోలింగ్ నిర్వహించాలని నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే దీనిపై విపక్షాలు హైకోర్టును ఆశ్రయించాయి.

ఎన్నికల కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్ సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఉందని, అందువల్ల నోటిఫికేషన్ ను రద్దు చేసి తాజా నోటిఫికేషన్ ను ఇవ్వాలని సింగిల్ జడ్జి  తీర్పు చెప్పారు. ఈ తీర్పును హైకోర్టు డివిజనల్ బెంచ్‌లో ఎన్నికలలో పోటీ చేసిన వ్యక్తులు, ఎన్నికల కమిషన్ సవాల్ చేశారు. డివిజనల్ బెంచ్ అటు ప్రభుత్వం, ఎన్నికల కమిషన్, పిటిషనర్ తరపున వాదనలు విన్న తర్వాత  ఈ యేడాది ఆగస్ట్‌ 5వ తేదీన తీర్పును రిజర్వ్ చేసింది.

సుప్రీంకోర్టు తీర్పులో స్పష్టం చేసినట్టు  నాలుగు వారాల గుడువును ఎన్నికల కమిషన్ పాటించలేదని, సుప్రీం తీర్పుకు విరుద్దంగా ఉన్న కమిషన్ నోటిఫికేషన్ ను రద్దు చేయాలని జనసేన తరపున న్యాయవాదులు వాదించారు. అయితే అప్పటికే ఎన్నికలు నిర్వహించామని, దీనివల్ల ప్రభుత్వంపై 160కోట్ల రూపాయల భారం పడిందని ప్రభుత్వం తరపున న్యాయవాదులు వివరించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం, తాము గతంలో ఇచ్చిన గడువు, ప్రస్తుతం ఇచ్చిన ఎనిమిది రోజుల గడువు సరిపోయిందని ఎన్నికల కమిషన్  తరపున న్యాయవాదులు వాదించారు. ఈ వాదనలు విన్న  తర్వాత.. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, జస్టిస్ ఉమాదేవితో కూడిన ద్విసభ్య ధర్మాసనం కౌంటింగ్‌కు  గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును తోసి పుచ్చింది. ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించవచ్చని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: