భాగ్యనగరం గణేష్‌ ఉత్సవాలకు ప్రసిద్ధి. గల్లీ గల్లీలో గణనాథులను ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నారు. ఈ నెల19వ తేదీన సామూహిక గణేష్ నిమజ్జనం ఉత్సవాలను నిర్వహించనున్నారు. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనంపై హైకోర్ట్ తీర్పు వెలువడిన తర్వాత  కొంత గందరగోళ పరిస్థితులు కనిపించాయి. అయితే తాజాగా సుప్రీంకోర్టు హుస్సేన్ సాగర్‌లో కేవలం ఈ ఏడాది వరకు విగ్రహాల నిమజ్జనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో భాగ్యనగర హిందు ఉత్సవ సమితి సభ్యులు సంబరాలు చేసుకున్నారు. గణేష్‌ నిమజ్జనానికి లైన్‌ క్లియర్‌ అయింది. సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో నిమజ్జనానికి బల్దియా ఏర్పాట్లు చేస్తోంది. సామూహిక గణేష్ నిమజ్జన శోభాయాత్రను ఘనంగా నిర్వహించేందుకు భక్తులు రెడీ అవుతున్నారు.

హైదరాబాద్‌లో 5 అడుగుల లోపు విగ్రహాలను నిమజ్జనం చేయడానికి 25 చోట్ల బేబీ పాండ్స్ సిద్ధం చేశారు. హుస్సేన్ సాగర్‌లో భారీ వినాయకులను నిమజ్జనం చేయనున్నారు.  నిమజ్జనం కోసం  40కి పైగా భారీ క్రేన్స్  ఏర్పాటు చేశారు. శానిటేషన్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలని  నిర్ణయించారు. సాగర్ చుట్టూ కొత్తగా కట్టిన నిర్మాణాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సాగర్‌లో నిమజ్జనం తర్వాత వ్యర్థాలు వెంటనే తీసివేసేలా ఆధునిక యంత్రాలను సిద్ధంగా ఉంచారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం పూర్తి చేసేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. హుస్సేన్‌ సాగర్‌ చుట్టూ నిమజ్జనం పాయింట్ల వద్ద భారీ క్రేన్లను ఏర్పాటు చేయడంలో నిమగ్నం అయ్యారు.

హుస్సేన్ సాగర్‌తోపాటు సరూర్ నగర్ చెరువులో నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు అధికారులు. వేగంగా నిమజ్జనం పూర్తి చేసేలా ప్రతి గణనాథుడికి ఇప్పటికే పోలీసులు జియో ట్యాగింగ్ పూర్తి చేశారు.  బాలాపూర్ గణనాథుడిని ఆదివారం ఉదయం బొడ్రాయి వద్దకు చేర్చి... అక్కడ లడ్డూ  వేలం పాట నిర్వహిస్తారు. చార్మినార్ మీదుగా హుస్సేన్ సాగర్‌కు గణనాథుడిని తరలిస్తారు. ఇక ఖైరతాబాద్ వినాయకుడిని మధ్యాహ్నం రెండు గంటల లోపు  నిమజ్జనం చేసేలా ఏర్పాట్లు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: