ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయంలో ఉంది. అటు పార్లమెంట్, ఇటు అసెంబ్లీ ఎన్నికలకు అప్పుడే తొందర పడాల్సిన అవసరం అయితే ఏ మాత్రం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం టార్గెట్ 2024 అంటూ నేతల మైండ్ సెట్‌ను ఇప్పటి నుంచే ట్యూన్ చేస్తున్నారు. రాష్ట్రంలో బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గానికి మాత్రమే ప్రస్తుతం ఉప ఎన్నికల జరగాల్సి ఉంది. అంతకు మించి ఎలాంటి తొందర లేదు. పైగా ప్రస్తుతం రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అటు అసెంబ్లీలో 151 సీట్లతో తిరుగులేని మెజారిటీ సాధించిన వైసీపీ... ఇటు పార్లమెంట్ స్థానాల్లో కూడా 22 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. ఇక మునిసిపల్ ఎన్నికల్లో అయితే... కేవలం ఒక్కటంటే ఒక్కటే స్థానాన్ని కోల్పోయింది. అది కూడా స్వల్ప తేడాతోనే. ఇక కొన్ని మునిసిపాలిటీల్లో అయితే రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా... పూర్తి ఏకగ్రీవంగా... కనీసం ప్రతిపక్షానికి చెందిన ఒక్కరంటే ఒక్కరూ కూడా సభ్యులు లేకుండా చేయగలిగింది.

ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముందుగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై దృష్టిపెట్టిన వైఎస్ జగన్... ఇప్పటికే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో దాదాపు 90 శాతం వరకు పూర్తి చేశారు కూడా. అది కూడా తొలి ఏడాదిలోనే. ఇదే విషయాన్ని ఇప్పటికే ఆ పార్టీ నేతలు పదే పదే చెప్పేస్తున్నారు. ఓ వైపు కరోనా కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ... ప్రజలకు సంక్షేమ పధకాలు అందించటంలో మాత్రంలో ఏ మాత్రం వెనకడుగు వేయటం లేదు వైఎస్ జగన్. ముందుగా హామీ ఇచ్చినట్లు చెప్పిన సమయానికి చెప్పినట్లు... అన్ని పధకాల అమలు చేస్తున్నారు. పధకాల అమలులో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా... అవకతవకలు జరగకుండా ఉండేందు కోసం... నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోనే డబ్బులు జమ అయ్యేలా చర్యలు చేపట్టారు సీఎం వైఎస్ జగన్. ఇదే అజెండాతో ఎన్నికలకు వెళ్లాలని ఇప్పుడు వైఎస్ జగన్ భావిస్తున్నారు. ఎన్నికల్లో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలను పెద్ద ఎత్తున ప్రచారం చేయాలనేది కూడా వైఎస్ జగన్ సూచన. గత ప్రభుత్వం చేసిన తప్పుల కంటే కూడా... ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పధకాల గురించే ప్రచారం చేయాలని కూడా ఇప్పటికే ముఖ్యనేతలకు జగన్ సూచించారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో జగన్ సర్కార్ కీలక అడుగులు వేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: