సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండున్నర ఏళ్లకుపైగా సమయం ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అప్పుడు ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయారు. గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశం తర్వాత సీఎం జగన్‌ మంత్రులతో ఆఫ్‌ ద రికార్డుగా కీలక వ్యాఖ్యలు, సూచనలు చేసినట్లు సమాచారం. ఇప్పటికే పరిపాలనను పక్కన పెట్టేశారని విమర్శలు ఎదుర్కొంటున్న సీఎం జగన్‌.. ఎన్నికలకు సిద్ధం కావాలని నాయకులకు, మంత్రులకు సూచించారట. జమిలి ఎన్నికల నిర్వహణను పరిశీలిస్తున్నట్లుగా చెబుతూ వస్తున్న కేంద్రం.. ఆ విషయాన్ని రాజ్యసభలో ప్రకటన చేసిన వెంటనే వ్యూహకర్తలను కూడా రంగంలోకి దించుతున్నట్లు చెప్పారట. ఈ విషయంగా ఇప్పటికే ప్రశాంత్‌ కిషోర్‌తో మాట్లాడినట్లు వెల్లడించారని సమాచారం. జమిలీ ఎన్నికల ప్రకటన వచ్చేవరకు పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ పక్కా వ్యూహంతో ముందుకెళ్లాలని మంత్రులకు సూచించారట ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి. ఎన్నికల ప్రణాళికల్లో భాగంగా ఇప్పటి నుంచే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని.. విపక్షాల ప్రచారానికి గట్టిగా కౌంటర్‌ ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిసింది.

వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందన్న ఆందోళన ఆ పార్టీ వర్గాల్లోనే వ్యక్తమవుతోంది. రెండున్నర ఏళ్లలోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం ముఖ్యమంత్రి జగన్‌తో పాటు ఆ పార్టీ నేతలను కలవరపెడుతోంది. రాష్ట్రంలో వరుసగా మహిళలపై జరుగుతున్న దాడులని విపక్షాలు ప్రశ్నిస్తుండటంతో ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతోంది. దిగజారుతున్న ఆర్ధిక పరిస్ధితితో సంక్షేమ పథకాల్లో కోత పెట్టడాన్ని ప్రతిపక్షాలు అస్త్రంగా మలచుకుంటున్నాయి. వీటన్నింటిపై వాస్తవాలను ప్రజలకు వివరించాలని మంత్రులను ఆదేశించారట ముఖ్యమంత్రి. డిప్యూటీ కలెక్టర్ మొదలు కింది స్థాయి వరకు గ్రామ సచివాలయాలకు వెళ్లి సమస్యలు పరిష్కరించాలని అధికారులను కూడా ఆదేశించినట్లు సమాచారం.

కొంత కాలంగా పింఛన్లపై విపక్షాల ఆరోపణలపై ప్రజలకే నేరుగా వివరాలు  తెలియజేయాలని సీఎం సూచించారట. లక్షల్లో పింఛన్లు తొలగిస్తున్నారంటూ విపక్షాలు ప్రచారం చేస్తున్నాయనీ, అయితే అర్హులైనవారి పింఛన్లు తొలగించడం లేదనే విషయాన్ని ఆధారాలతో చెప్పాలనీ పార్టీ శ్రేణులను ఆదేశించాలని మంత్రులకు సూచించారట సీఎం జగన్‌. ట్రూ అప్ చార్జీలు టీడీపీ ప్రభుత్వ హయంలో వచ్చిన నష్టాల కారణంగా చెల్లిస్తున్న విషయం వినియోగదారులకు అర్థమయ్యేలా చెప్పాలని కూడా సీఎం సూచించారట. అయితే ఇన్నాళ్లు కరోనా పేరు చెప్పి ప్రజల వద్దకు వెళ్లని మంత్రులు, వైసీపీ ప్రజాప్రతినిధులు.. ఇప్పుడు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళితే పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: