ఉత్తరప్రదేశ్‌ శాసనసభ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ వాద్రా పోటీ చేస్తారన్న ప్రచారం గత 24 గంటల్లో ఊపందుకుంది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా తూర్పు ఉత్తర ప్రదేశ్ బాధ్యతలు నెత్తిన వేసుకున్న ప్రియాంకగాంధీ వాద్రా.. ఇప్పుడు ఎన్నికల రాజకీయాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఉత్తరప్రదేశ్‌ పార్టీ క్యాడర్‌ ప్రియాంకగాంధీ వాద్రాను తప్పకుండా పోటీ చేయాలని కోరడంతో ఆమె అనివార్యంగా బరిలోకి దిగే అవకాశం ఉంది.

జవహర్‌లాల్‌ నెహ్రూ నుంచి రాహుల్ గాంధీ వరకు అందరూ లోక్‌సభకు  పోటీ చేసినవారే. ఎన్నికల రాజకీయాల్లో ఉన్నవారే. దీంతో ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీలో పట్టు కోసం ప్రియాంకగాంధీ వాద్రా కూడా ఎన్నికల వైపు చూసే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ ఓడిపోయిన అమేఠీ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ స్థానాలు,  లేదా సోనియా గాంధీ గెలిచిన రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక దానిని  ప్రియాంకగాంధీ వాద్రా ఎంపిక చేసుకునే వీలుంది. సోనియా గాంధీ ఆరోగ్యం సరిగ్గా లేనందున.. ప్రియాంకగాంధీ వాద్రా కూడా రాయ్‌బరేలీ వైపే మొగ్గు చూపే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

2022 సంవత్సరం ప్రారంభంలోనే ఉత్తరప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. అధికార భారతీయ జనతా పార్టీ పట్ల రాష్ట్రంలోని కొన్ని సామాజిక వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు భారతీయ జనతా పార్టీ, బహుజన సమాజ్‌ పార్టీలు కుమ్మక్కు అయ్యాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సరిగ్గా ఇప్పుడే ప్రజాదరణను కూడగట్ట గల నేత కాంగ్రెస్ వైపున ఉంటే మంచిదన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. పైగా ఎన్నికలకు చాలా ముందుగా ప్రియాంకగాంధీ వాద్రాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే కాంగ్రెస్‌కు విజయావకాశాలు పెరుగుతాయని ఆ పార్టీ హైకమాండ్‌ భావిస్తోంది. ఈ దిశగానే ఉత్తరప్రదేశ్‌ వ్యాప్తంగా ప్రతిజ్ఞా యాత్ర నిర్వహించనున్నారు. ఈనెల 20న ప్రారంభమయ్యే యాత్రలో ప్రియాంకగాంధీ వాద్రా కూడా పాల్గొంటారు. మొత్తం 12 వేల కిలోమీటర్ల మేర ఆమె యాత్ర కొనసాగేలా ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం.

మొత్తంమీద ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రియాంకాగాంధీ వాద్రా పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే నియోజకవర్గం కూడా ఖరారు చేసుకున్నట్లు సమాచారం. ప్రతిజ్ఞా యాత్ర నిర్వహించడం కూడా ఎన్నికల్లో పోటీ కోసమేనని పార్టీ వర్గాలు అంటున్నాయి. మరి ఉత్తరప్రదేశ్‌ కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు ప్రియాంకగాంధీ వాద్రాను బరిలోకి దించాలన్న పార్టీ హైకమాండ్‌ ప్లాన్‌ ఏ మేరకు సత్ఫలితాలు ఇస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: