ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 30 నెలలు కావోస్తుంది. ఇప్పటికే రెండున్నరేళ్ల పరిపాలన పూర్తి చేసుకున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం.... మిగిలిన రెండున్నరేళ్ల కాలానికి మాత్రం... సరికొత్త టార్గెట్‌ పెట్టుకుంది. కేవలం రెండంటే రెండే పేజీలతో ఎన్నికల మేనిఫెస్టోను 2019 ఎన్నికల సమయంలో విడుదల చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... అదే తమకు భగవద్గీత, బైబిల్, ఖురాన్ అని చెప్పారు.  చెప్పినట్లుగానే ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో విజయం సాధించిన తర్వాత... పధకాల అమలుపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. ఇప్పుడు ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉన్నప్పటికీ... ఆయన దృష్టి మాత్రం ఇప్పటి నుంచే టార్గెట్ 2024పై పెట్టారు జగన్. 2019 ఎన్నికల సమయంలో గత సంప్రదాయాలకు విరుద్ధంగా అన్ని పార్టీల నేతలను ఆశ్చర్యానికి గురి చేస్తూ... రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు, 25 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఎన్నికల్లో పోటీ చేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేర్లను ఒకేసారి ప్రకటించారు. అదే సమయంలో ఇలా ఎవరైనా చేయగలరా అని సవాలు కూడా విసిరారు.

ప్రకటన సమయంలో చాలా నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు పూర్తిగా ఆ ప్రాంత వాసులకు కొత్త వారే. మరి కొంతమంది అయితే... అసలు రాజకీయాలకే కొత్త. కొంతమంది అయితే ఎన్నికలకు సరిగ్గా రెండు నెలల ముందే పార్టీలో చేరిన వారు కూడా. అయితే వీరంతా కూడా దాదాపు భారీ మెజారిటీతోనే విజయం సాధించారు. ఇందుకు ఏకైక కారణం వైఎస్ జగన్ మాత్రమే. ఒక్క ఛాన్స్ అంటూ పాదయాత్ర సమయంలో జగన్ చెప్పిన మాట, ఇచ్చిన హామీలు ఎన్నికల్లో ఓటర్లను బాగా ప్రభావితం చేశాయి. అందుకే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిచిన నియోజకవర్గాల్లో కూడా వారి మెజారిటీ నామమాత్రమే. ఇంకా చెప్పాలంటే... నాలుగు అంకెల సంఖ్య కూడా దాటలేని పరిస్థితి. ఇక విజయనగరం, నెల్లూరు, కడప జిల్లాల్లో అయితే... ఏకంగా అన్ని సీట్లు వైసీపీ ఖాతాలోనే. పెద్ద జిల్లాల్లో కూడా టీడీపీ ఒకటి రెండు స్థానాలే గెలవగలిగింది. ఇక ఎన్నికల ఫలితాల తర్వాత... ప్రభుత్వానికి నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు, ఒక జనసేన ఎమ్మెల్యే మద్దతు తెలిపారు కూడా. అయితే ఇప్పుడు టార్గెట్ 2024లో కూడా జగన్ 2019లో అనుసరించిన వ్యూహాన్నే మళ్లీ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో దాదాపు వంద మందికి మళ్లీ అవకాశం కష్టమే. మరోసారి కేవలం తన ఫోటో మాత్రమే చూపించి... ఓటర్లను ఓట్లు వేయమని అడిగే అవకాశం ఉంది. అందుకో వంద నియోజకవర్గాల్లో కొత్త వారికి అవకాశం ఇచ్చేందుకు జగన్ ప్లాన్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: