ఏపీ అధికార పార్టీ వైసీపీలో నిన్న మొన్న‌టి వ‌ర‌కు నెల‌కొన్న‌.. నైరాశ్యం తొల‌గిపోయిందా?  అటు పార్టీ అధిష్టానం నుంచి ఇటు కార్య‌క‌ర్త‌లు, నాయకుల వ‌రకు ఆనందంగా ఉన్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌క‌లు. నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ ప్ర‌భుత్వానికి అన్ని వైపుల నుంచి అనేక స‌మ‌స్య‌లు చుట్టుము ట్టాయి. ఆర్థిక క‌ష్టాలు.. అప్పులు ల‌భించే ప‌రిస్థితి లేక‌పోవ‌డం.. మ‌రోవైపు ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంటున్న నిర్ణ‌యాల‌కు కోర్టుల రూపంలో ఇబ్బందులు రావ‌డం వంటివి నాయ‌కుల‌ను క‌ల‌చి వేశాయి.

దీంతో ఏ నిర్ణ‌యం తీసుకున్నా.. ఎలాంటి స‌మ‌స్య వ‌స్తుందో.. అని నాయ‌కులు, పార్టీ అధిష్టానం కూడా హ‌డ‌లి పోయే ప‌రిస్థితి వ‌చ్చింది. ఇక‌, అప్పులు ల‌భించ‌క‌పోవ‌డం.. మ‌రోవైపు.. ప్ర‌తిప‌క్షాల నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు రావ‌డం .. వంటి ప‌రిణామాలు కూడా ప్ర‌భుత్వానికి ఇబ్బందిగా మారాయి. ఇక‌, కోర్టుల్లోనూ ఇబ్బందులు త‌ప్ప‌లేదు. అయితే.. ఇప్పుడు అనూహ్యంగా చోటు చేసుకున్న మూడు కీల‌క ప‌రిణామాలు.. వైసీపీలో జోష్ పెంచాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇప్ప‌టి వ‌రకు ఉన్న ప‌రిణామాలు.. ఒకింత స‌ర్దుకున్న‌ట్టేన‌ని చెబుతున్నారు.

ఒక‌టి:  ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో అల్లాడుతున్న ప్ర‌భుత్వానికి కేంద్రం నుంచి బాస‌ట ల‌భించింది. సుమారు 2700 కోట్ల రూపాయ‌లు అప్పులు తీసుకునేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ల‌భించింది. దీంతో ఇప్పుడు చాలా వ‌ర‌కు ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు తొలిగిపోయే అవ‌కాశం ఉంది. అదే స‌మ‌యంలో క‌రెంటు బిల్లుల ట్రూ అప్ చార్జీలు.. కేవ‌లం మ‌న రాష్ట్రంలోనే కాద‌ని.. ఇత‌ర రాష్ట్రాల్లోనూ అమ‌ల‌వుతున్నాయ‌నేది మ‌రో కార‌ణం.

రెండు:  సీఎం జ‌గ‌న్‌పై సొంత పార్టీ ఎంపీ ర‌ఘురామ‌రాజు వేసిన బెయిల్ ర‌ద్దు పిటిష‌న్‌ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. అంతేకాదు.. ఈ బెయిల్ విచార‌ణ బెంచ్‌ను మార్చాల‌న్న అభ్య‌ర్థ‌న‌ను తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది. ఇది.. వైసీపీలో మ‌రింత బిగ్ జోష్‌ను నింపింది.

మూడు:  ప‌రిష‌త్ ఎన్నిక‌ల విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు నెల‌కొన్న సందిగ్ధానికి తాజాగా రాష్ట్ర హైకోర్టు.. తెర‌దించింది. ప‌రిష‌త్ ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను వెల్లడించ‌వ‌చ్చ‌ని.. తీర్పు వెలువ‌రించింది. ఇది.. కూడా వైసీపీలో ను నాయ‌కుల్లోనూ అంత‌కుమించి ప్ర‌భుత్వంలోనూ భారీ జోష్ నింపింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి: