గత కొన్నిరోజులుగా అనంతపురం తెలుగుదేశం పార్టీలో నాయకుల మధ్య పెద్ద ఎత్తున రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల సీనియర్ నాయకుడు కాల్వ శ్రీనివాసులు అధ్యక్షతన రాయలసీమ టి‌డి‌పి నేతల సమావేశం జరిగింది. సీమలోని నీటి ప్రాజెక్టులు, రైతుల అంశాలపై చర్చ జరిగింది. ఇక ఈ సమావేశానికి హాజరైన జే‌సి ప్రభాకర్ రెడ్డి....పార్టీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలని నాయకులు సరిగ్గా పట్టించుకోవడం లేదని, వారికి అండగా ఉండటం లేదని, అనంతలో ఇద్దరు నేతల వల్ల పార్టీ నాశనమైపోతుందని మాట్లాడారు.

ఇక జే‌సి అలా మాట్లాడిన వెంటనే అనంత టి‌డి‌పి నేతలు వరుసపెట్టి, ఆయనకు కౌంటర్లు ఇచ్చేశారు. జే‌సిపై మిగిలిన టి‌డి‌పి నేతలు ఫైర్ అయ్యారు. వన్‌సైడ్‌గా జే‌సిని టార్గెట్ చేసి విమర్శించారు. ఇలా రచ్చ జరుగుతుండగానే, తాజాగా శింగనమల టి‌డి‌పి ఇంచార్జ్ బండారు శ్రావణి వర్గం...కాల్వ శ్రీనివాసులుని టార్గెట్ చేసింది. తాజాగా అనంతపురం పార్లమెంట్ అధ్యక్షుడుగా ఉన్న కాల్వ శ్రీనివాసులు...పార్లమెంట్ కమిటీని నియమించారు. ఈ కమిటీలో శింగనమలకు చెందిన ఓసీ నాయకులని తీసుకున్నారు. దీంతో శ్రావణి వర్గం ఫైర్ అయింది.

ఎస్సీ రిజర్వడ్ నియోజకవర్గంలో ఓసీల పెత్తనం ఏంటని ఫైర్ అయ్యారు. దీనిపై శ్రావణి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రెస్ మీట్ పెట్టాలని అనుకున్నారు. కానీ పార్టీ కీలక నాయకులు అందుకు అనుమతించలేదు. దీంతో ఆమె...కాల్వ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తమ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వకపోతే రాజీనామాకు సిద్ధంగా ఉన్నట్లు శ్రావణి వర్గం చెబుతోంది.

అయితే ఆ కమిటీలో తాడిపత్రికి చెందిన జే‌సి వర్గానికి కూడా ప్రాధాన్యత ఇవ్వలేదని తెలుస్తోంది. జే‌సి వ్యాఖ్యలు కారణంగానే కాల్వ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనబడుతోంది. బండారు శ్రావణి కూడా జే‌సి ఫ్యామిలీ వర్గమే కాబట్టి, శింగనమలలో శ్రావణి వర్గానికి కూడా ప్రాధాన్యత ఇవ్వలేదని తెలుస్తోంది. ఇలా అనంత టి‌డి‌పిలో రచ్చ జరుగుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: