ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం .. టీడీపీలో కొత్త జోష్ క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌తంలో లేని దూకుడు ఇప్పుడు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని చెబుతున్నారు. వాస్త‌వానికి 2019 ఎన్నిక‌ల త‌ర్వాత‌.. పార్టీలో డీలా ప‌రిస్థితి క‌నిపించింది. తిరిగి అధికారం చేప‌డుతుంద‌ని పార్టీలో భారీ అంచ‌నాలు ఉన్నాయి. అయితే.. అనూహ్యంగా జ‌గ‌న్ పాద‌యాత్ర టీడీపీపై తీవ్ర ప్ర‌బావం చూపించింది. తిరుగులేద‌ని అనుకున్న నాయ‌కు లు కూడా ఓడిపోయారు. దీంతో పార్టీలో తీవ్ర నైరాశ్యం నెల‌కొంది. దీనికితోడు.. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చీ రావ‌డంతోనే చేప‌ట్టిన ప‌థ‌కాలు.. కార్య‌క్ర‌మాలు టీడీపీని మైన‌స్‌ల‌లోకి ప‌డేశాయి.

దీంతో పార్టీ పుంజుకో వ‌డం క‌ష్ట‌మ‌ని ఒక నిర్ణ‌యం వ‌చ్చింది. దీనికి క‌రోనా కూడా తోడు కావ‌డం.. చంద్ర‌బాబు కు అసెంబ్లీలో తీవ్ర ప‌రాభవాలు ఎదుర‌వ‌డం.. కీల‌క నాయ‌కులు పార్టీ నుంచి జంప్ చేయ‌డం వంటివి టీడీపీకి మ‌రింత ఇబ్బందిగా మారింది. ఈ ప‌రిణామాల నుంచి పార్టీ కోలుకుంటుందా? అనే సందేహాలు కూడా వ్య‌క్త‌మ‌య్యాయి. అయితే.. ఇంత‌లోనే చంద్ర‌బాబు పూర్తిగా కోలుకున్నారు. స్థానిక ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని ప్ర‌చారం చేశారు. అయితే.. నాయ‌కుల మ‌ధ్య స‌ఖ్య‌త లేని కార‌ణంగా.. ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ విజ‌యం ద‌క్కించుకోలేక పోయింది.

అయిన‌ప్ప‌టికీ.. ప‌ట్టువీడ‌ని విక్ర‌మార్కుడి మాదిరిగా చంద్ర‌బాబు విజృంభించారు. ఎప్ప‌టిక‌ప్పుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై విరుచుకుప‌డుతున్నారు. ఇది ఇటీవ‌ల కాలంలో బాగానే క‌లిసి వ‌చ్చింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఒక‌టి చంద్ర‌బాబునేరుగా బ‌య‌ట‌కు రావ‌డం.. రెండు లోకేష్ దూకుడు.. పార్టీలో నేత‌ల‌ను ముందుకు క‌దిలేలా చేసింది. అదేస‌మ‌యంలో వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించి.. అమ‌లు చేస్తున్న కార్య‌క్ర‌మాలు కూడా క‌లిసి వ‌స్తున్నాయి. తాజాగా రైత కోసం తెలుగు దేశం పేరిట ప్రారంభించిన ఐదురోజుల నిర‌స‌న కార్య‌క్ర‌మాల‌ను  కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వ‌హిస్తున్నా.. ప్రాంతాల వారీగా చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో ఏయే ప్రాంతాల్లో ఎవ‌రెవ‌రు దూకుడుగా ఈ కార్య‌క్ర‌మాల‌కు హాజ‌ర‌వుతున్నార‌నే విష‌యాన్ని చంద్ర‌బాబు ప‌రిశీలిస్తున్నారు. దూకుడుగా ఉన్న వారికే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఛాన్స్ ఉంటుంద‌నే విష‌యాన్ని ఆయ‌న చెప్ప‌క‌నే చెబుతున్నారు. దీంతో ఇప్పుడు పార్టీలో అంద‌రూ క‌ల‌సి క‌ట్టుగా ముందుకు సాగుతున్నారు. రైతు ఉద్య‌మంపేరుతో జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై నిప్పులు చెరుగుతున్నా.. ప‌రోక్షంగా టీడీపీలో ఉన్న అనైక్య‌త‌ను ప‌క్కన పెట్టి నేత‌లంతా ఒక్క‌ట‌వుతున్న ప‌రిణామం.. పార్టీలో జోష్ నింపుతుండ‌డం గ‌మ‌నార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: