ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండున్నర ఏళ్ల తర్వాత... ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తొలిసారి రాజకీయాల గురించి ప్రస్తావించారు. అది కూడా ప్రస్తుతం గురించి మాత్రం కాదు. భవిష్యత్తు గురించి. అది కూడా ఏకంగా 2024 సార్వత్రిక ఎన్నికల గురించి. నిన్నటి మంత్రివర్గ సమావేశ అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... తన మంత్రివర్గ సహచరులతో కాసేపు ముచ్చటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి శాసనసభాపక్ష సమావేశంలో వైఎస్ జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలతో కీలక వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే... ఇప్పుడు వచ్చే మంత్రులంతా కేవలం రెండున్నరేళ్ల పాటు పదవుల్లో ఉంటారని... ఆ తర్వాత కొత్త వారికి అవకాశం ఇస్తానన్నారు. ఆశావహులు ఏ మాత్రం నిరుత్సాహ పడొద్దని... రెండో దఫాలో తప్పకుండా అవకాశం వస్తుందని భరోసా ఇచ్చారు కూడా. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది. ఈ ఏడాది నవంబర్ నెలలో కొత్త మంత్రివర్గ ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే తన సహచరులకు చెప్పేశారు వైఎస్ జగన్.

సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో తన సహచరులతో కాసేపు ముచ్చటించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... తొలిసారి సరికొత్త కామెంట్ చేశారు. అదే టార్గెట్ 2024. ఇప్పుడు ఉండే మంత్రివర్గాన్ని మారుస్తున్నట్లు స్వయంగా మంత్రులకు చెప్పిన జగన్... 80 శాతం మందికి పదవి పోతుందని జగన్ క్లారిటీ ఇచ్చేశారు. అదే సమయంలో మీరంతా నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదన్న జగన్... ఈ రెండున్నరేళ్లు మీకు చేతినిండా పనుంది అని చెప్పేశారు. అదేమిటంటే... వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఇందుకోసం ప్రతి ఒక్కరు కూడా వారి వారి జిల్లాల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం ఇప్పటి నుంచి కృషి చేయాలని సూచించారు. ఇంకా చెప్పాలంటే.. వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తే... మీకే లాభం జరుగుతుంది అంటూ తాయిలాలు కూడా ప్రకటించారు. ఎన్నికల్లో విజయం సాధిద్దాం... మరింత లాభం పొందుదాం అనేలా జగన్ వ్యాఖ్యానించినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ఉన్న వారిలో కేవలం 20 శాతం మందికి మాత్రమే పదవులుంటాని క్లారిటీ ఇచ్చేశారు జగన్. చూడాలి ఆ అదృష్టవంతులు ఎవరో మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: