ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చి మూడేళ్లకు దగ్గర పడుతోంది. ఒక సామాన్య ఓటరుగా ఆలోచిస్తే మనకు ఏమైనా ప్రయోజనం దక్కిందా ? దీనికి ఒకసారి మనలో మనమే పునఃపరిశీలించుకోవలసి ఉంది. గడిచిన పాలన అంతా పూర్తిగా సంక్షేమం మీదనే ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించడంతో మిగతా విషయాలు అన్నీ మరుగునపడిపోయాయి. జగన్ మీద కోటి ఆశలతో ఓట్లు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరు ఈ రోజు తలదించుకునే పరిస్థితి వచ్చిందనే వ్యాఖ్యలు రాష్ట్రమంతా వినిపిస్తున్నాయి. సంక్షేమ కార్యక్రమాల పేరుతో ప్రజలను ఇంకా సోమరిపోతులుగా చేస్తున్నారు అనే అపవాదు రోజు రోజుకీ ప్రజల్లో బలంగా మారుతోంది. అయితే ఈ అభిప్రాయం రాష్ట్ర వ్యాఫంగా ఉందని అనలేము. కానీ ఇప్పుడిప్పుడే అది కాస్తా ప్రమాదంగా పరిణమించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. 

వాస్తవంగా చూసుకుంటే గడిచిన ఈ రెండున్నరేళ్ల సమయంలో ఒక నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజు నుండి ఈ నాటి వరకు.. ప్రజలకు ఉపయోగపడే పనులనే చేశారు. కానీ అనుభవరాహిత్యం కారణంగా ఆదాయాన్ని సమకూర్చడం మరియు అభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో కాస్త వెనుకబడ్డాడు అన్నది కాదనలేని వాస్తవం. దీనిని ఏ విధంగా ప్రజలకు ప్రతిపక్షాలకు అర్ధమయ్యే రీతిలో కవర్ చేసుకోవాలో అనేది ప్రభుత్వానికి తెలియలేదు. అయితే ఇక్కడ సామాన్య ప్రజలు ఆలోచించుకోవాల్సిన విషయం ఏమిటంటే, జగన్ ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీలను అన్నిటినీ వరుసగా చేసుకుంటూ వచ్చాడు. ఇందులో జగన్ చేసిన తప్పేంటి ఎందుకు ఇంత వ్యతిరేకత అనేది అర్ధం కానీ ప్రశ్న. ఎన్నికల మానిఫెస్టోని చూసి కదా ప్రజలంతా ఓట్లు వేశారు. ఎక్కడైనా జరిగేది ఇదే.

కాబట్టి మేనిఫెస్టోలోని అంశాల మీదనే దృష్టి పెట్టాడు. అందులో దాదాపు 90 శాతం రెండేళ్ల లోనే పూర్తి చేశాడు. ఈ రోజు ఎవరైతే జగన్ ప్రవేశ పెట్టిన సంక్షేమ కార్యక్రమాల వలన లబ్ది పొందుతున్నారో వారందరినీ జగన్ చేసింది, చేస్తోంది తప్పు అని గుండెల మీద చెయ్యేసుకుని చెప్పమనండి... చెప్పలేరు.  అయినా ఈ వ్యతిరేకత అంతా పూర్తి స్థాయిలో లేదు. కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉంది. ఇంకా సమయం మించి పోలేదు. ఇంకా ఉన్న రెండేళ్ళను సరిగా ఉపయోగించుకుంటే వచ్చే ఎన్నికల్లో మరీ కష్టపడకుండా గెలవొచ్చు లేదా ప్రతిపక్షాల నుండి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: