గుజరాత్‌లో నూతన మంత్రివర్గం కొలువుదీరింది. అయితే కొత్తగా ఏర్పాటైన క్యాబినెట్‌లో అన్నీ కొత్త ముఖాలే కనిపిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. నాలుగు రోజుల కింద ఆ రాష్ట్ర నూతన సీఎంగా భూపేంద్ర పటేల్‌ బాధ్యతలు స్వీకరించారు. కేబినెట్‌లో మంత్రులుగా ఎవరికి స్థానం కల్పించాలనే దానిపై భారతీయ జనతా పార్టీ అగ్రనేత అమిత్‌ షా సుదీర్ఘ కసరత్తు చేశారట. ఆయన సూచనల మేరకే నూతన మంత్రివర్గం కూర్పు జరిగిందట. ఈ క్రమంలోనే గురువారం మొత్తం 24 మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌ ప్రమాణం చేయించారు. వీరిలో 10 మంది కేబినెట్‌ మంత్రులు కాగా.. 14 మంది సహాయ/స్వతంత్ర మంత్రులు ఉన్నారు.

గుజరాత్‌లో వచ్చే ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ ‘నో రిపీట్‌’ విధానాన్ని అవలంభించింది. అందుకు అనుగుణంగానే నూతన మంత్రివర్గంలోకి అంతా కొత్తవారికే అవకాశం ఇచ్చింది. మాజీ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ సర్కారులో మంత్రులైన వాళ్లెవరికీ ఈ ప్రభుత్వంలో చోటు దక్కలేదు. అసెంబ్లీ స్పీకర్‌ రాజేంద్ర త్రివేదిని మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. ప్రమాణ స్వీకారానికి కొద్ది గంటల ముందు త్రివేది తన పదవికి రాజీనామా చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన 24 మందిలో 21 మంది తొలిసారిగా మంత్రులు అయ్యారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ కూడా మొదటిసారి ఎమ్మెల్యేనే. గతంలో మంత్రులుగా ఉన్నవారు కూడా ఇందులో ఉన్నారు. వీరిలో కిరీట్‌సిన్హా రాణా, రాజేంద్ర త్రివేది, రాఘవ్‌జీ పటేల్‌లు ఉన్నారు. గుజరాత్‌లో పటేల్‌లు అధికంగా ఉన్నారు. వారి సపోర్ట్‌ పొందడానికే ఈ మార్పులను భారతీయ జనతా పార్టీ హైకమాండ్‌ చేపట్టినట్లు సమాచారం. కొత్త మంత్రివర్గంలోనూ ఏకంగా ఆరుగురు పటేల్‌ వర్గీయులకు చోటు కల్పించడం దీనినే రూఢీ పరుస్తోంది.

మొత్తంమీద గుజరాత్‌ సర్కారులో న్యూలుక్‌ కనిపించేలా చేయాలన్న ఉద్దేశంతోనే కొత్త క్యాబినెట్‌ కూర్పులో పలు జాగ్రత్తలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రితోపాటు మిగతా మంత్రివర్గ సభ్యులను, అందులోనూ కొత్త ముఖాలను ఎంపిక చేశారని చర్చ జరుగుతోంది. ఎన్నికలకు కేవలం 15 నెలల సమయమే ఉన్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ వేసిన ఈ పాచిక పారుతుందో లేదో కాలమే తేల్చాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: