ఏపీలో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పావులు క‌దుపుతున్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌న నేరుగా చెప్ప‌క‌పోయినా.. గురువారం జ‌రిగిన రాష్ట్ర మంత్రివ‌ర్గ భేటీలో చూచాయ‌గా స్ప‌ష్టం చేశారు. సో.. ఈ క్ర‌మంలో.. రాష్ట్రంలో వ‌చ్చే ఏడాది ఎన్నిక‌ల‌కు వెళ్లే అవ‌కాశం స్ప‌ష్టం గా క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే త‌న‌కు 2019లో అధికారంలోకి వ‌చ్చేందుకు స‌హ‌కారం ఇచ్చిన‌.. వ్యూహ‌క‌ర్త‌.. ప్ర‌శాంత్ కిశోర్‌ను రంగంలోకి దింపి.. త‌న పాల‌న‌పై ప్ర‌జాభిప్రాయాన్ని తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయితే.. ముంద‌స్తుకు వెళ్తే.. జ‌గ‌న్‌కు క‌లిసి వ‌చ్చే బ‌లాబలాలు ఏంటి? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌.

నిజానికి ఏ ప్ర‌భుత్వ‌మైనా.. రాజ్యాంగ బ‌ద్ధంగా త‌మ‌కు ద‌క్కిన ఐదేళ్ల‌ను పాల‌న‌ను స‌ద్వినియోగం చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తుంది. గ‌తంలో తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌చ్చినా. అప్ప‌టి ఏపీ పాల‌కుడు.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు మాత్రం .. త‌మ‌కు ప్ర‌జ‌లు ఐదేళ్లు అవ‌కాశం ఇచ్చారు క‌నుక‌.. దానిని తాము సంపూర్ణంగా వినియోగించుకుంటామ‌ని చెప్పారే త‌ప్ప ముందస్తుకు వెళ్ల‌లేదు. కానీ, తొలిసారి ముఖ్య‌మంత్రిగా అవ‌కాశం వ‌చ్చిన‌.. వైసీపీ అధినేత జ‌గ‌న్ మాత్రం ముంద‌స్తుకు వెళ్తున్నారు. దీనికి ఆయ‌న‌కు ఉన్న భారీ బ‌లం ఏంటి?  ఎందుకు వెళ్తున్నారు?  వెళ్తే.. మ‌ళ్లీ ఇంత భారీ మెజారిటీ వ‌స్తుందా? అనేది కీల‌క ప్ర‌శ్న‌లు.

ప్ర‌స్తుతం రాష్ట్రంలో అన్ని వ‌ర్గాల‌కు.. ఏదో ఒక రూపంలో సంక్షేమం పేరిట ప్ర‌భుత్వం నుంచి ప‌థ‌కాలు అందుతున్నాయి. వైఎస్సార్ చేయూత కావొచ్చు.. జ‌గ‌న‌న్న విద్యాకానుక కావొచ్చు.. లేదా మ‌రేదైనా.. కావొచ్చు.. స‌మాజంలోని ప్ర‌తి ఒక్క‌రికీ.. ఏదో ఒక ప‌థ‌కం వ‌ర్తిస్తోంది. దీనివ‌ల్ల వేల రూపాయ‌ల్లో ప్ర‌తి ఏటా.. ప్ర‌జ‌ల‌కు ల‌బ్ధి చేకూరుతోంది. ఇది దేశంలో ఏ రాష్ట్రంలోనూ జ‌ర‌గ‌ని సంక్షేమంగానే ప్ర‌తి ఒక్క‌రూ చెప్పుకొంటున్నారు.. వాస్త‌వానికి ఇది నిజం కూడా. ఇదే ఇప్పుడు జ‌గ‌న్‌కు వ‌రంగా మారింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌తంలో చంద్రబాబు స‌హా.. ఏ ముఖ్య‌మంత్రి అమ‌లు చేయ‌ని విధంగా జ‌గ‌న్ అనేక సంక్షేమాలు అమ‌లు చేస్తున్నారు.

అదేస‌మ‌యంలో పేద‌ల‌కు 30 ల‌క్ష‌ల ఇళ్ల స్థ‌లాలు ఇవ్వ‌డం కూడా క‌నీ వినీ ఎరుగ‌ని సంక్షేమ‌మే.. దీనిలో కొన్ని లొసుగులు ఉంటే ఉండొచ్చు.. కానీ, మెజారిటీ ప్ర‌జ‌ల‌కు మాత్రం మేళ్లు చేసింద‌నేది వాస్త‌వం. అదేస‌మ‌యంలో ఇత‌ర ప‌థ‌కాల ద్వారా కూడా ప్ర‌జ‌ల‌కు ల‌బ్ధి చేకూరుతోంది. ఈ క్ర‌మంలోనే త‌న ప‌థ‌కాలు.. త‌న‌ను మ‌ళ్లీ అధికారంలోకి తీసుకువ‌స్తాయ‌ని.. ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న కుట్ర‌ల‌ను బ‌ద్నాం చేస్తాయ‌ని.. సీఎం జ‌గ‌న్ భావిస్తున్నార‌ని అంటున్నారు. ఈ ఒక్క బ‌లంతోనే.. ఆయ‌న ప్ర‌జ‌ల్లోకి వెళ్లి.. ముంద‌స్తు.. యుద్ధంలో విజ‌యం సాధించాల‌ని చూస్తున్నార‌ని.. విశ్లేష‌కులు భావిస్తున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: