భారతీయ జనతా పార్టీ.... 2014 సంవత్సరానికి ముందు వరకు కూడా పూర్తిగా ప్రాంతీయ పార్టీలపై ఆధారపడిన పార్టీ. దాదాపు దేశ వ్యాప్తంగా ఒకటి రెండు చోట్ల తప్ప... అన్ని రాష్ట్రాల్లో కూడా లోకల్ పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు కమలం పార్టీ నేతలు. గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక తప్ప... అన్ని చోట్ల పొత్తులతో కాపురం చేసిన వారే కాషాయ నేతలు. తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీతో, మహారాష్ట్రలో శివసేనతో, జమ్ము కశ్మీర్‌లో మహ్మద్ ముఫ్తీ మహ్మద్ సయ్యద్ పార్టీతో.... ఇలా పొత్తులతో కాలం గడిపారు. దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్, కేంద్ర మాజీ మంత్రి లాల్ కృష్ణ అద్వానీ కష్టపడి పార్టీని నిలబెట్టారు. సరిగ్గా 30 ఏళ్ల క్రితం కేవలం 2 స్థానాలతో మాత్రం పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం వహించిన బీజేపీ... 2019 ఎన్నికల్లో పూర్తిస్థాయి మెజారిటీతో దేశ వ్యాప్తంగా 300 పైచిలుకు స్థానాలను గెలుచుకుని ప్రభుత్వాన్ని స్థాపించగలిగింది.

అయితే గుజరాత్ రాష్ట్రంలో పార్టీని వరుసగా అధికారంలోకి నిలబెట్టిన నాటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీని ప్రధాని అభ్యర్థిగా 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీ సారధ్యంలోని ఎన్‌డీఏ కూటమి ప్రకటించింది. ఓట్ ఫర్ నమో అంటూ ఎన్నికల్లో ఓట్లు అభ్యర్థించారు బీజేపీ నేతలు. అదే సమయంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న యూపీఏ సర్కార్‌పై వ్యతిరేకతతో ఉన్న దేశ ప్రజలు... ఎన్‌డీఏ కూటమికి భారీ మెజారిటీ కట్టబెట్టారు. తమ ప్రసంగంతోనే ప్రజలను మాయ చేయగల నేత నరేంద్ర మోదీ. ప్రపంచ దేశాల సరసన భారత్‌ను సరికొత్తగా ఆవిష్కరించారు కూడా. ఇదే సమయంలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో సరైన నేత లేరనే మాట కూడా ప్రజల్లో విస్తృతంగా ప్రచారం అవ్వడంతో... 2019 ఎన్నికల్లో కూడా మరోసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. రెండోసారి కూడా మోదీ ప్రధాని పదవిలో కూర్చున్నారు. అయితే 71వ పుట్టిన రోజు చేసుకుంటున్న మోదీ... మరోసారి అదే పదవిలో కూర్చుంటారా లేదా అనేది ఇప్పుడు అందరి మదిలో ఉన్నా. సాధారణంగా బీజేపీలో 70 ఏళ్లు దాటిన నేతలకు బీజేపీలో విశ్రాంతి ఇస్తారు. అదే సూత్రం ఇప్పటికే అమలు చేస్తున్నారు కూడా. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న యడియూరప్పను 72 ఏళ్ల వయసులో పదవి నుంచి తప్పించారు కమలం పార్టీ నేతలు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలకు బీజేపీ తరఫున ప్రధాని అభ్యర్థి ఎవరు అనేది ఇప్పటికే పార్టీలో చర్చ మొదలైంది. మోదీనే ఉంటారా... లేక కొత్త వారు వస్తారా... వస్తే ఆ వ్యక్తి ఎవరూ... అనేవి ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల ప్రశ్నలు.


మరింత సమాచారం తెలుసుకోండి: