ఏపీ సీఎం జ‌గ‌న్‌.. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని దాదాపు డిసైడ్ అయ్యారు. మ‌రో ఏడాదిలో ఆయ‌న ముంద‌స్తుకు వెళ్లే అవ‌కాశం క‌నిపిస్తోంది. అయితే.. ఏపీ విష‌యాన్ని ప‌రిశీలిస్తే.. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు పెద్ద సెంటిమెంటే ఉంది. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్తే.. మ‌ళ్లీ గెలుస్తారా?  లేదా?  అనే విష‌యాన్ని ప‌రిశీలిస్తే.. గ‌తంలో టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు  చేసిన ప్ర‌య‌త్నం విక‌టించింది. ఆయ‌న 2004లో ముంద‌స్తుకు వెళ్లారు. ఇంకా ఆరు మాసాల‌కు పైగానే త‌న‌కు పాల‌నా స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ.. చంద్ర‌బాబు .. ముందస్తు ఎన్నిక‌ల‌కు వెళ్లారు. అయితే.. ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న ఘోరంగా ఓడిపోయారు.

ఇక‌, అప్ప‌టి నుంచి రాష్ట్రంలో ముంద‌స్తు ఎన్నిక‌ల ముచ్చ‌ట చోటు చేసుకోలేదు. అయితే.. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. తెలంగాణ‌లో 2018లో ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌చ్చాయి. అక్క‌డ కొన్ని రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌ల కార‌ణంగా.. అధికార పార్టీ తిరిగి అధికారంలోకి వ‌చ్చింది. మ‌రి ఏపీ విష‌యంలో ఇలానే జ‌రుగుతుందా?  అనేది.. సందేహంగా ఉంది. గ‌తంలో న‌వ్యాంద్ర ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబుకు కూడా ముంద‌స్తు ఆలోచ‌న వ‌చ్చింది. దాదాపు అన్ని వ‌ర్గాల నుంచి ముంద‌స్తుకు వెళ్లాల‌నే ఒత్తిడి కూడా వ‌చ్చింది. అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న ముంద‌స్తుకు వెళ్ల‌కుండా.. పూర్తిగా త‌న ఐదేళ్ల కాలాన్ని స‌ద్వినియోగం చేసుకున్నారు.

మ‌రి ఇప్పుడు కార‌ణాలు ఏవైనా.. వైసీపీ అధినేత .. సీఎం జ‌గ‌న్ ముంద‌స్తుకు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకోవ డం.. సెంటిమెంటు వెంటాడుతుండ‌డం వంటి కార‌ణాలు ఆస‌క్తిగా మారాయి. స‌రే.. సెంటిమెంటు ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. జ‌గ‌న్ పాల‌న‌కు ప్ర‌జ‌లు జై కొడ‌తారా?  లేదా? అనేది ముఖ్యం. ఇప్ప‌టి వ‌ర‌కు ఉత్త‌మ ముఖ్య‌మంత్రిగా.. జ‌గ‌న్ జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చుకున్నారు. దీనికి ప్ర‌ధానంగా  ఆయ‌న అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు.. ఇత‌ర‌త్రా కార్య‌క్ర‌మాలు. సో.. ఆయ‌న‌కు ప్ర‌జ‌ల్లో మంచి ఫాలోయింగ్ ఉంద‌నే అంటున్నారు.

అయితే... ఇది ఎన్నిక‌ల నాటికి ఏమౌవుతుంది?  జ‌గ‌న్‌కు మంచి పేరు ఉన్న‌ప్ప‌టికీ.. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కుల దూకుడు కార‌ణంగా.. ఆయ‌న‌కు ఇబ్బందులు ఏర్ప‌డితే.. ప‌రిస్థితి ఏంటి?  అనేది కూడా ఆలోచించాల్సిన విష‌యం. ఏదేమైనా.. ముంద‌స్తు వ్యూహం ఏమేర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: