ఏపీ రాజకీయాలు అంటేనే...బూతులు అన్నట్లుగా పరిస్తితి మారిపోయింది. ఒకప్పుడు అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయం ఒక పద్ధతిగా జరిగేది...రాజకీయ నాయకులు విమర్శలు కూడా హద్దులు దాటేవి కాదు. నాయకులు తమ ప్రత్యర్ధులపై నిర్మాణాత్మకమైన విమర్శలు చేసేవారు. ఏ నాయకుడు కూడా హద్దులు దాటి ప్రవర్తించే వారు కాదు. కానీ ఇప్పుడు రాజకీయాలు అలా లేవు చాలా అంటే చాలా దరిద్రంగా ఉన్నాయి. ఇప్పుడు విమర్శలు అంటే బూతులు మాట్లాడటమే.

ఒకరిని ఒకరు బూతులు తిట్టుకోవడమే నేటి ఆంధ్రా రాజకీయం. అధికార వైసీపీ, ప్రతిపక్ష టి‌డి‌పి నేతలు బూతులు తిట్టుకోవడంలో పి‌హెచ్‌డిలు చేసినట్లు కనిపిస్తున్నారు. నాయకులు ఒకరినొకరు గౌరవం ఇచ్చి పుచ్చుకోవడం అనేదే లేదు. ఇష్టారాజ్యంగా తిట్టుకోవడమే నాయకుల పని. ఇందుకు వైసీపీ, టి‌డి‌పి నేతలు అతీతులు కాదు. తాజాగా టి‌డి‌పి సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడు సి‌ఎం జగన్‌ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

సాధారణంగా విమర్శలు చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న అయ్యన్న కూడా తన స్థాయిని మరిచి జగన్‌ని తిట్టారు. వాడు-వీడు అంటూ...ఇంకా చెత్తగా మాట్లాడేశారు. అసలు రాయలేని విధంగా విమర్శించారు. ఇక అయ్యన్న వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ మరో రచ్చకు తెరలేపారు. ఏకంగా కార్యకర్తలని తీసుకుని వెళ్ళి, చంద్రబాబు ఇంటిపై ఎటాక్ చేయడానికి వెళ్ళినట్లు తెలిసింది. అక్కడ వైసీపీ-టి‌డి‌పి కార్యకర్తల మధ్య పెద్ద రచ్చే జరిగింది.

అలాగే జోగి రమేష్ ఎప్పటిలాగానే తన నోటికి పనిచెప్పారు. మళ్ళీ బూతులతో చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. అంటే ఏ నాయకుడు కూడా తక్కువ కాదనే చెప్పొచ్చు. అందరూ అందరే అన్నట్లుగా బూతులు మాట్లాడటంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. జనాలకు పనికొచ్చే పనులు చేయకుండా, పనికిమాలిన రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తోంది. దీని వల్ల ప్రజలకు పావలా ఉపయోగం లేదు. పైగా ఇలాంటి మాటల వల్ల నాయకులే జనాల్లో చులకన అవుతారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp