పేరుకే సీనియర్లు... కానీ అవసరానికి మాత్రం కంటికి కూడా కనిపించటం లేదు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం... పదవుల కోసం పాకులాడతారు. ఇంటికి కనీసం రెండు పదవులైనా కావాలని పట్టుబడతారు. అదే పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ... కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం కనీసం ఆ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఇంకా చెప్పాలంటే కుంటి సాకులతో అధినేత కంటికి కనిపించకుండా తప్పించుకు తిరుగుతున్నారు. ఇప్పటి వరకు మీరు చదివింది ఎవరి గురించో కాదు... తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతలుగా గుర్తింపున్న కేఈ కుటుంబం గురించి. మాజీ మంత్రులుగా ఉన్న కేఈ కృష్ణమూర్తి, కేఈ ప్రభాకర్ సోదరులు ఇప్పుడు ఏమయ్యారో తెలియటం లేదు. ఒకప్పుడు కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీని ముందుండి నడిపించారీ బ్రదర్స్. 1999 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ్ముడు కేఈ ప్రభాకర్ మంత్రిగా వ్యవహరించారు. అప్పుడు కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా కేఈ కృష్ణమూర్తి గెలుపొందారు. ఇద్దరు సోదరులు పార్టీలో కీలకంగానే వ్యవహరించారు. జిల్లాలో ఏం జరగాలన్నా కూడా వారి కనుసన్నల్లోనే నడిచాయి.

ఇక 2014 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన కేఈ కృష్ణమూర్తి... చంద్రబాబు ప్రభుత్వంలో సీనియర్ నేతగా వ్యవహరించారు. రెవెన్యూ, దేవాదాయ శాఖలకు మంత్రిగా కూడా పనిచేశారు. ఇదే సమయంలో పార్టీ అధిష్ఠానంపై సొంత శాఖ అధికారుల తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు కేఈ కృష్ణమూర్తి. పూర్తి స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా వ్యవహరిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానంపై విమర్శలు చేశారు. తిరుమలలో ఏం జరుగుతుందో.... కనీసం దేవాదాయ శాఖకు కూడా సమాచారం ఇవ్వడం లేదని... ఇంత మాత్రానికి ఈ శాఖకు మంత్రిగా ఉండటం వల్ల నాకు గౌరవం ఎక్కడ ఉందంటూ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు టీటీడీ ప్రభుత్వంలో భాగమా కాదా అని కూడా ప్రశ్నించారు. ఇక కేఈ ప్రభాకర్ అయితే నేరుగా పార్టీ అధినేత చంద్రబాబుపైనే ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ పదవి కోసం ఎంతో ప్రయత్నించిన మాజీ మంత్రి ప్రభాకర్... అది దక్కకపోయే సరికి.. తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. అయితే సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలోకి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి, ఆయన భార్య సుజాతమ్మ చేరడంతో కేఈ కుటుంబం ఒకింత ఇబ్బంది పడింది. కోట్ల కుటుంబం టీడీపీ చేరడం సరి కాదని... వారిని చంద్రబాబు దూరంగా పెట్టాలనే కామెంట్లు కూడా చేశారు. ఆ తర్వాత అధినేత బుజ్జగించడంతో... తప్పని పరిస్థితుల్లో సరే అని తలూపారు. అయితే ఆ ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత... ప్రస్తుతం కేఈ కుటుంబం ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా అధినేతను కలవలేదు. టీడీపీ అధిష్ఠానం ఇచ్చిన ఏ ఒక్క కార్యక్రమం కూడా ఇప్పటి వరకు నిర్వహించలేదు. ఒక దశలో వారిద్దరు పార్టీలోనే ఉన్నారా అని కార్యకర్తలకే అనుమానం వచ్చింది. ఇప్పటికైనా కేఈ కుటుంబం ఏమైందో నియోజకవర్గ ప్రజలకు తెలియాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

KEK